నీందితుడు పక్కింటి బాలుడే…

` వీడిన సహస్ర హత్యకేసు మిస్టరీ
` చోరీ కోసం వచ్చినప్పుడు ఇంట్లో బాలిక ఉండటంతో ఘాతుకానికి ఒడిగట్టిన వైనం
హైదరాబాద్‌(జనంసాక్షి):
హైదరాబాద్‌: కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సంగీత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన పదేళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనుక మిస్టరీ వీడిరది. బాలానగర్‌ డీసీపీ సురేష్‌ కుమార్‌ నేతృత్వంలో పోలీసులు 5 రోజులు శ్రమించి నిందితుడైన మైనర్‌ బాలుడిని అరెస్టు చేశారు. దొంగతనానికి వెళ్లిన బాలుడు.. ఈవిషయాన్ని బాలిక ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతోనే దారుణానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా నిర్ధరించినట్టు సమాచారం. దొంగతనం చేసేందుకు వచ్చిన బాలుడు డబ్బులు తీసుకొని వెళ్తుండగా.. బాలిక చూడటం గమనించి విషయం బయటకు తెలుస్తుందని భయపడి ఉంటాడని భావిస్తున్నారు. అందుకే కత్తితో అత్యంత దారుణంగా బాలికను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, తన వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడా? లేక ఘటన జరిగిన ఇంట్లోని కత్తినే ఉపయోగించాడా?అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడని పోలీసులు నిర్ధరించారు. హత్య జరిగిన రోజు నుంచి అనుమానం రావడంతో స్కూల్‌కి వెళ్లిన బాలుడిని విచారించి ఈరోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన సహస్ర పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆమెకు కేకు తినిపించాడు. కేకు తినిపించిన చేతులతోనే బాలిక ప్రాణాలు తీయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.దొంగతనం చేసే ముందు చోరీ ఎలా చేయాలి?ఎలా బయటకు వెళ్లాలనే విషయాలను బాలుడు రాసుకున్నట్టుగా అనుమానిస్తున్న ఓ పేపర్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాస్తవాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. హత్య జరిగిన ఇంట్లో మరోసారి క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. బాలానగర్‌ జోన్‌ డీసీపీ కె.సురేష్‌ కుమార్‌, కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడిరచనున్నట్టు కూకట్‌ పల్లి పోలీసులు తెలిపారు.
ఏం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు ఐదేళ్లుగా కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా మెకానిక్‌ షెడ్డులో పనిచేస్తుండగా, రేణుక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌. వీరికి కుమార్తె సహస్ర(10), కుమారుడు(7) ఉన్నారు. సహస్ర బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటికి సమీపంలోని బడికి వెళ్తున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లగా, వారి కుమారుడు పాఠశాలకు వెళ్లాడు. క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది.
స్కూల్‌ నుంచి ఫోన్‌ రావడంతో
తానే స్కూల్‌కు వెళ్లి తమ్ముడికి లంచ్‌బాక్సు ఇస్తానని బాలిక చెప్పడంతో తల్లి భోజనం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ‘లంచ్‌ బాక్సు తీసుకురాలేదేమంటూ’ స్కూల్‌ సిబ్బంది.. కృష్ణకు ఫోన్‌ చేయడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో తెరిచారు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
బాలిక ఒంటి మీద 20 కత్తి గాట్లు..
బాలిక శరీరంపై 20వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 ఉన్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం..హత్య సోమవారం ఉదయం 9.30-10.30 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారమిచ్చారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా కిందికి వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి.. గత ఐదు రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.