నీటి తరలింపుపై ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ
కృష్ణా బేసిన్ లో రోజురోజుకు నీటి లభ్యత తగ్గిపోతుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టడంతో ఇన్ ఫ్లో పడిపోయింది. దీంతో కృష్ణాపై ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో గోదావరి నది నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లను తరలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన అత్యుత్తమంగా ఉండడంతో ఆదిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమై… సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా అధికారుల స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హైదరాబాద్ జలసౌధలో సమావేశమయ్యారు. తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్ రావు, వెంకటేశ్వర్ రావు, అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ నరసింహరావు, విశ్రాంత ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఈ మీటింగ్ కు హాజరయ్యారు.
గోదావరి నుండి కృష్ణాకు నీటితరలింపుపై ఇరురాష్ట్రాల అధికారులు ప్రధానంగా చర్చించారు. రెండు రాష్ట్రాల అవసరాలు, నీటి లభ్యతను గుర్తించారు. గోదావరి నుండి ఎంత నీటిని వాడుకోవాలనే అంశంపై సూత్రప్రాయంగా ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే నీటి తరలింపు, రూట్ అలైన్ మెంట్, తదితర అంశాలపై తదుపరి సమావేశంలో చర్చిస్తారు. ప్రాథమికంగా గోదావరిలో 1000 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని తేల్చారు. మన అవసరాలకు 700 నుంచి 800 టీఎంసీలు అవసరం ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సుమారు 1300 టీఎంసీల నీళ్లు అవసరం ఉంది. మన రాష్ట్రానికి 500 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ ఉంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు ఉన్న డిమాండ్లపై చర్చించారు.
గోదావరి నీటిని రెండు రాష్ట్రాలు కలిసి ఏవిధంగా వాడుకోవలన్న అంశంపైనే అధికారులు చర్చించారు. గోదావరి నుండి కృష్ణా బేసిన్ కు నీటి తరలింపునకు ఉన్న అవకాశాలపై డిస్కస్ చేశారు. ప్రాథమిక అవసరాలు, నీటిని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై లోతుగా చర్చ జరిగింది.
గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు నీటి తరలింపునకు సంబంధించి ఏపీ నుంచి మూడు, నాలుగు ప్రతిపాదనలొచ్చాయి. తెలంగాణ అధికారులు కూడా రెండు రకాల ప్రతిపాదనలు చేశారు. నీటి తరలింపునకు ఉన్న సమస్యలు, ఇబ్బందులు అన్నింటిపై తరువాత మీటింగ్ లో చర్చించనున్నారు. మొత్తంగా ఇదే అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారు. ఆ సమావేశానికి ముందే రెండు రాష్ట్రాల అధికారులు మరోసారి సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు.