నీట్‌పై అభ్యంతరాలు సుప్రీంకు నివేదిస్తా

3

– కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా

న్యూఢిల్లీ,మే16(జనంసాక్షి):నీట్‌ పరీక్షపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సోమవారం నీట్‌ పరీక్షపై రాష్టాల్ర వైద్య మంత్రుల సమావేశం నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ వైద్య విద్య అభ్యసించాలనుకున్న వారి ఆందోళనను దృష్టిలో పెట్టుకుని నీట్‌ సమావేశం ఏర్పాటు చేసామన్నారు. సిలబస్‌ విషయంలో ఇబ్బందులున్నాయని, ప్రాంతీయ భాషలో పరీక్ష రాసే విద్యార్థుల విషయంలో ఏం చేయాలి అన్న విషయంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. అన్ని రాష్టాల్రు  నీట్‌ను సూతప్రాయంగా అంగీకరించారని అయితే ఈ ఏడాదికి మినహాయింపును కోరాయన్నారు. మంత్రులు లేవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని కేంద్రమంత్రి జేపీనడ్డా పేర్కొన్నారు. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (నీట్‌)పై  కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో సమావేశం నిర్వహించారు. అన్ని రాష్టాల్ర ఆరోగ్యశాఖ మంత్రులు, కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరపున ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ హాజరయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడుతూ.. నీట్‌ నిర్వహించడానికి అన్ని రాష్టాల్రు సూతప్రాయంగా అంగీకరించాయని తెలిపారు. నీట్‌ను నిర్వహించాలని రాష్టాల్ర మంత్రులు చెప్పారని పేర్కొన్నారు. ఈ పరీక్ష నిర్వహణలో ప్రధానంగా మూడు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికే వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించామని రాష్టాల్రు తెలిపాయన్నారు. నీట్‌ పరీక్ష సిలబస్‌, రాష్టాల్ర సిలబస్‌ వేర్వేరుగా ఉన్నాయని తెలిపారని వివరించారు. భాషాపరమైన అభ్యంతరాలను రాష్టాల్ర మంత్రులు వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు ముందు రాష్టాల్ర అభ్యంతరాలను ఉంచుతామని, త్వరలో నీట్‌ సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు.