నీతిలేని మన నేతలు

వరద బాధితుల సమక్షంలో బురద రాజకీయం
వీహెచ్‌, రాథోడ్‌, నారాయణ బాహాబాహీ
అసహ్యించుకున్న భద్రతా సిబ్బంది
డెహ్రాడూన్‌, జూన్‌ 26 (జనంసాక్షి) :
రాష్ట్ర నేతలు వదర బాధితుల సమక్షంలో బురద రాజకీయానికి తెరతీశారు. తమకసలే నీతి లేదని నిరూపించుకున్నారు. పొరుగు రాష్ట్రమని, పక్కనే ఉన్న వేలాది మంది చూస్తున్నారనే జ్ఞానం కూడా లేకుండా దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. వారి చర్యను చూసి అంగరక్షకులుగా ఉన్న భద్రతా సిబ్బందే అసహ్యించుకున్నారంటే రాష్ట్ర నేతల బాహాబాహీ ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.  ఉత్తరాఖండ్‌లో వరుణుడు సృష్టించిన ప్రళయంలో చిక్కుకొని ప్రాణాలతో బయటపడిన యాత్రికుల చేరవేత విషయమై కాంగ్రెస్‌, టీడీపీ ఎంపీల మధ్య డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో వివాదం చోటుచేసుకుంది.  కొద్దిసేపు పరస్పర ఆరోపణలు.. దూషణపర్వం కొనసాగింది. కాంగ్రెస్‌ ఎంపి వి.హనుమంతరావు, తెలుగుదేశం ఎంపీలు రమేష్‌ రాథోడ్‌, కొనకళ్ల నారాయణ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో సాగింది. బుధవారం సాయంత్రం డెహ్రాడూన్‌ ఎయిర్‌పోర్టుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎంపీలు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ కాంగ్రెస్‌ ఎంపి వి.హనుమంతరావు, కేంద్రమంత్రి బలరాం నాయక్‌, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. యాత్రికుల తరలింపు ఏర్పాట్లపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంలో ఎంపీల మధ్య వాగ్వాదం సాగింది. వివరాలు ఇలా ఉన్నాయి..
మన స్థాయి ఇదేనా : వీహెచ్‌
ఎయిర్‌పోర్టులో హడావుడి జరుగుతుండడంతో చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా సేవలందించారు.. స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలి కదా అని చంద్రబాబుతో అంటుండగా, ఆ పార్టీ ఎంపీలు తనమీదకి దూసుకువచ్చారని వీహెచ్‌ తెలిపారు. దీంతో మాటామాట పెరిగి వాగ్వాదం కొనసాగిందన్నారు. అందరి ధ్యేయం ఒక్కటే, సురక్షితంగా యాత్రికులను స్వస్థలాలకు తరలించడం. పది రోజులుగా ఇక్కడే ఉండి యాత్రికులకు చేదోడుగా ఉంటున్నామని తెలిపారు. జలవిలయం దురదృష్టకరం.. మానవత్వం చాటుకోవలసిన అవసరం ఉందన్నారు.
ప్రచారానికి సమయం కాదు : ఉత్తమ్‌ కుమార్‌
యాత్రికులను పార్టీలకతీతంగా సురక్షితంగా తరలించాల్సిందే.. ఈ సమయంలో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.
మా సేవలను అడ్డుకోవడం అన్యాయం : శ్రీధర్‌
ప్రభుత్వపరంగా సేవలందిస్తుంటే అడ్డుకోవడం ప్రతిపక్ష పార్టీకి తగదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. యాత్రికులను సురక్షితంగా తరలించడం మాని వారిని ఇబ్బందులకు గురిచేయడం సమంజసంగా లేదన్నారు. వారిని తరలించడమే మానవత్వమని, దాన్ని చాటుకునే వారికి ఆహ్వానం పలుకుతామని అన్నారు.
ఇన్నాళ్లు ఎక్కడున్నారు : బలరాం
పది రోజులుగా యాత్రికులకు తాము చేదోడు వాదోడుగా సేవలందిస్తున్నామని కేంద్రమంత్రి బలరాం నాయక్‌ అన్నారు. డెహ్రాడూన్‌ నుంచి ప్రత్యేక విమానాన్ని బుధవారం సాయంత్రం 5 గంటలకు నడుపుతున్నట్టుగా మంగళవారే ప్రకటించామని, వరద రాజకీయం చేసేందుకు ప్రతిపక్షం పూనుకోవడం విచారకరమన్నారు. పది రోజుల నుంచి పట్టించుకోని వారు చివరి రోజు వచ్చి హడావుడి చేయడం.. యాత్రికులను ఇబ్బంది పెట్టడం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. రాజకీయానికి ఇది సమయం కాదన్నారు. సున్నిత విషయంపై రాజకీయం చేయాలని చూడడం మంచి సంప్రదాయం కాదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు.
యాత్రికులను తరలించడమే ముఖ్యం : చంద్రబాబు
ఎవరేం చేసినా.. ఎవరేం మాట్లాడినా పట్టించుకోను. తెలుగు వారిని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తరలించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. క్షేమంగా వారిని తరలిస్తే తనకంతే చాలన్నారు. మిగతా విషయాలను పట్టించుబోనన్నారు. మాకు వనరులు లేకపోయినా యాత్రికులను తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వమే ముందుగా ఏర్పాట్లు చేసిందని తెలిస్తే తాము వచ్చే వాళ్ళమే కాదని అన్నారు. చార్‌ధామ్‌ యాత్రలో తెలుగు వారిపట్ల వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు.
వందకోట్లు : చిరంజీవి
ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి పర్యాటకశాఖ రూ.100 కోట్ల ప్యాకేజీని అందిస్తోందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. న్యూఢల్లీిలో బుధవారంనాడు మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో జలవిలయం దురదృష్టకరమన్నారు. గత వందేళ్ళలో ఇలాంటి జలవిలయాలు జరగలేదని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నానన్నారు. రాజకీయ మనుగడ కోసమే తెలుగుదేశం పార్టీ వరద రాజకీయం చేస్తోందని చిరంజీవి ఆరోపించారు.