నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరులో జాప్యం

హైకోర్టులో వందమంది పిటిషన్లు దాఖలు
అక్టోబర్‌ 5లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం
అమరావతి,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరు జాప్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు 2017`18 సంవత్సరాల్లో చేపట్టిన పనులకు నేటి వరకు బిల్లులు మంజూరు చేయలేదంటూ హైకోర్టులో 100 మంది పిటిషన్లు వేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా అఫిడవిట్‌ దాఖలు చేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్లు కోర్టుకు వచ్చాక ఇప్పుడు విచారణ చేయడమేంటని హైకోర్టు నిలదీసింది. బకాయిలు ఉన్నాయనే వివరాలు కోర్టుకు ఎందుకు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమాలపై ఎంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. విచారణ పేరుతో బిల్లులు ఇవ్వకపోవడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 5లోగా కౌంటర్‌ దాఖలు చేయకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వాన్ని కోర్టు హెచ్చరించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.