నీరో చక్రవర్తిలా మన్మోహన్‌ తీరు

– సీపీఐ నారాయణ ధ్వజం
– తెలంగాణ ఇవ్వాలని ప్రధానితో భేటి
– ఏకాభిప్రాయం లేదన్న వ్యాఖ్యలపై నిరసన
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ”రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న” చందంగా ప్రధాని తీరున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నిత్యం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే, నిత్యం యువకులు బలిదానాల బాట పడుతుంటే ప్రధాని మాత్రం మౌనం వహిస్తున్నారని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గురువారం నారాయణ తమ పార్టీ ప్రతినిధులతో కలిసి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుయాత్రలో తమకెదురైన అనుభవాలను ప్రధానికి వివరించారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక ఆకాంక్ష బలంగా ఉన్నట్లు విన్నవించారు. తెలంగాణపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రధానిని నారాయణ కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. తమ బృందం చెప్పిందంతా విన్న మన్మోహన్‌ సింగ్‌ తెలంగాణ ఏర్పాటుపై ఏకాభిప్రాయం లేదని తెలిపినట్లు నారాయణ మీడియాకు వెల్లడించారు. ప్రధాని సమాధానం సంతృప్తికరంగా లేదని, ప్రధాని తీరు చూస్తే సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లుగా కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వైఖరి తమను తీవ్ర నిరాశపర్చిందని, అయినా, తెలంగాణ ఉద్యమంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రానికి కనువిప్పు కలిగేలా తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని నారాయణ పునరుద్ఘాటించారు.