నీళ్ల లొల్లికి ముగింపు లేదా ?
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య లేక నీళ్ల వివాదం తేల్చక రావణ కాష్టంలా ఎప్పుడు రగులుతూనే ఉంది.ప్రభుత్వాలు మారినప్పుడల్లా అదను దొరికితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కయ్యానికి కాలుదువ్వుతోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయంలో నీళ్ల లొల్లి ప్రధానమైంది.మలిదశ తెలంగాణ ఉద్యమానికి మూలాలు నీళ్లతోనే ముడిపడి ఉండేది.నాడు గోరటి వెంకన్న పాటలోని కనిపించని కుట్రలు తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా జరుగుతునే ఉన్నాయి.ప్రపంచ రాజకీయాలు రాబోయే రోజుల్లో నీటివనరుల పై జరిగే ఘర్షణలే శాసిస్తాయని నీటి నిపుణులు గతంలో ప్రస్తావించిన విషయం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థం అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని దశాబ్దం గడచినా కేంద్ర ప్రభుత్వం జల పంపకాలను తేల్చలేదు.కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కు ప్రాజెక్టులు అప్పగించినట్లు వార్తలు గుప్పుమనడంతో కొత్తగా ఏర్పాటు చేసిన రేవంత్ ప్రభుత్వం ఇరకాటంలో పడ్డది.కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిన అపఖ్యాతిని పక్కదారి పట్టించడంకోసం కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు పై మాట్లాడుతున్నారని ఎదురుదాడి చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండు నెలలు కాకుండనే సందులో సడేమియా అన్నట్లుగా కేంద్రం పెత్తనం స్టార్ట్ చేసింది. తెరవెనుక ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మొదలైంది. కేసీఆర్ మాత్రం నల్లగొండ సభ ద్వారా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అవలంబిస్తున్న తీరు, జరిగే నష్టంపై ప్రజలకు వివరించి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం జరుగుతుంది. కేఆర్ఎంబీ కి అప్పగించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9వ భాగంలో ఇరు రాష్ట్రాల మధ్య జలవనరుల నిర్వహణ,అభివృద్ధికి సంబందించిన అంశాలను పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246, 7వ షెడ్యూల్ లో పొందుపర్చిన జాబితాలోని 17వ అంశం ప్రకారం కృష్ణ నది జలాలపై పూర్తీ హక్కులు రాష్ట్రాలకే ఉంటాయి. జలవివాదాల చట్టం సెక్షన్-3 కింద ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలను పరివాహక ప్రాంత నిష్పత్తి 68:32 ప్రకారం పున:పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు.కృష్ణా జలాల్లో వాటా తేలేదాకా 50:50 నిష్పత్తిలో పంపకాలు జరుగాలని కేఆర్ఎంబి నుంచి వాకౌట్ చేసారు.నీళ్ల పంపకాలు తెల్చకుండా కేంద్రం గతంలో ఎంత ఒత్తిడి చేసినా మా వాటా తేల్చే వరకు కేఆర్ఎంబి కి అప్పగించకుండా మెడమీద కత్తి పెట్టితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పని పరిస్థితిలో ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి వచ్చిందని కేసీఆర్ ప్రభుత్వం చెప్పుతున్నది.కాంగ్రెస్ మాత్రం 2015లో తెలంగాణ ప్రయోజనాలను బిన్నంగా తాకట్టుపెట్టి 34:66 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగానికి తెలంగాణ ఎంఓయూ చేసుకున్నది నిజం కాదా? అంటూ ప్రశ్నిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన కంటే, కేసీఆర్ హయాంలోనే నీళ్ల లూటీ ఎక్కువ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించకుండా కేఆర్ఎంబీ పై పెత్తనం కోసం ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే తెలంగాణ శాశ్వత ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయం.
నీళ్ల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఉన్నమాట కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. నీటి వినియోగం మాట ప్రబలమైన రాజకీయ డిమాండ్ రావడం విచిత్రమేమి కాదు. ఏపీ,సీఎం జగన్,నాటి సీఎం కేసీఆర్ ఇక బేషన్లు లేవు,బేషజాలు లేవు,పాత పంచాయితీలు మర్చిపోయి ఉభయ రాష్ట్రాల ప్రజలకు మంచి జరిగేలా ముందుకు సాగుతామంటూ సంయుక్త ప్రకటన స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడింది. పాలమూరు – రంగారెడ్డి,డిండి,ఎస్సెల్బీసీ ప్రాజెక్టులకు అనుమతి లేదని 2021లోనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినా ఎందుకు నోరెత్తలేదు? అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడేమో పోరాటం చేస్తామని ఎన్నికల స్టంట్ గా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంకా నల్లగొండలో సభ ఎలా నిర్వహిస్తారో చూస్తామంటూ నీళ్ల మంత్రి ఉత్తమ్ ఒంటి కాలుమీద లేస్తున్నారు. కేసీఆర్ కంచికి వెళ్లిన సందర్భంలో రోజా ఇంట్లో భోజనము ఆరగించి, రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు గోదావరి జలాల తరలింపుకు సహకరిస్తామని నాడు స్పందించడం, జగన్ తో కల్సి భోజనాలు చేయడం, స్వీట్లు తినిపించుకోవడం పాపం అయ్యింది. కట్ చేస్తే .. రెండు సంవత్సరాల క్రింద ఏపీ సీఎం జగన్ కృష్ణ జలాల వాటాను కేసీఆర్ ప్రభుత్వానికి తాకట్టుపెట్టినారని తెలుగుదేశం ఆరోపించింది.ప్రభుత్వాలు మారినప్పుడల్లా నీటి మీద రభసా అర్థం కావడం లేదు.జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు కయ్యానికి కాలు దువ్వడం వెనుక రెండు పార్టీల స్వార్థం కన్పిస్తున్నది. దశాబ్దంగా ఇరు రాష్టాల జగడం తేల్చకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం కేంద్రానికి సబబు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355