నువ్వు ఆడు.. మేమున్నాం.. సచిన్‌కు సెలెక్టర్ల మద్ధతు
ముంబై ,నవంబర్ 28 :సచిన్ రిటైర్మెంట్‌కు సంబంధించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా…. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు చీమ కుట్టినట్టైనా లేదు. ఇప్పటికే బోర్డు సభ్యులు అతన్ని వెనకేసుకొస్తుంటే తాజాగా సెలక్టర్లు కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు. సచిన్‌కు మధ్ధతుగా నిలుస్తున్నారు. తన రిటైర్మెంట్‌పై సచిన్ సెలక్టర్లతో మాట్లాడాలని కపిల్‌దేవ్ , గవాస్కర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాస్టర్ వారి మాటను పట్టించుకున్నట్టే కనిపిస్తోంది. ఇవాళ ప్రత్యేకంగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌తో పాటు మిగిలిన సభ్యులతో కూడా అతను మాట్లాడాడు. తన భవిష్యత్తుపై వారే నిర్ణయం తీసుకోవాలని కూడా సచిన్ చెప్పినట్టు సమాచారం. అయితే సెలక్టర్లు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నీకు మేమున్నాం… నువ్వు ఆడాలంటూ కోరినట్టు తెలుస్తోంది. దీంతో సచిన్ తన రిటైర్మెంట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని భావిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత మాస్టర్ కెరీర్‌కు ముగింపు పలికితే మంచిదని పలువురు సూచిస్తున్నారు. 39 ఏళ్ళ టెండూల్కర్ టెస్టుల్లో సెంచరీ చేసి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది స్వదేశంలో కివీస్‌తో జరిగిన సిరీస్ నుండీ ఫామ్ కోల్పోయిన సచిన్ తాజాగా ఇంగ్లాండ్‌పైనా విఫలమయ్యాడు. సాధారణ బంతులకే మాస్టర్ ఔటవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ , కపిల్‌దేవ్ లాంటి మాజీ ఆటగాళ్ళు కూడా సచిన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చేశారు. సచిన్‌ను తప్పుకోమని అడిగే ధైర్యం సెలక్టర్లకు ఎలాగూ లేదు. అయితే వారికే నిర్ణయం వదిలేసిన సమయంలోనూ సెలక్టర్లు అతనికి సపోర్ట్‌గా నిలవడంపై విశ్లేషకులు తప్పుపడుతున్నారు.