నూతన ఎక్సైజ్‌ పాలసీకి సీఎం ఆమోదం

వచ్చే ఏడాది 12 వేల కోట్ల ఆదాయం
రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశం : మంత్రి పార్ధసారథి
హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :
నూతన ఎక్సైజ్‌ పాలసీకి ప్రభుత్వం లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. మరో రెండ్రోజుల్లో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడిరచింది. ఈ ఏడాది మద్యం విక్రయాల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో బెల్టుషాపులు లేవని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు నూతన మద్యం విధానానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. నూతన మద్యం పాలసీపై శనివారం సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్‌ శాఖ ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్న ఈ భేటీలో మద్యం విధానానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. ఈ ఏడాది మద్యం విక్రయాల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే ఏడాదిలో రూ.12 వేల కోట్ల మేర ఆదాయం రావచ్చని అభిప్రాయపడ్డారు. నూతన మద్యం విధానానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, ఒకటి రెండ్రోజుల్లో మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు. మద్యం వ్యాపారులకు అనుగుణంగా నూతన విధానం ఉందన్న వాదన సరికాదని.. ఈ విధానానికి ప్రజల ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో బెల్టుషాపులు లేవని చెప్పారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెల్టుషాపులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.