నెలలోగా తెలంగాణ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం

నిజామాబాద్‌, జనవరి 4 ( నెలలోపు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం టిఆర్‌ఎస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన గంగారెడ్డి మాట్లాడుతూ, గత నెల 28న ఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నెలలోపు తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్‌, టిడిపి, వైకాపాలు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం వల్ల ప్రజలు అయోమయానికి గురయ్యారని ఆయన అన్నారు. తెలంగాణపై టిడిపి స్పష్టమైన నిర్ణయం తెలిపే వరకు తెలంగాణ ప్రజలు ఆ పార్టీని నమ్మరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ అర్బన్‌ ఇన్‌చార్జీ లక్ష్మీనరసయ్య, టిఆర్‌ఎస్‌ నాయకులు సుజిత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కామారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి నియోజవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వాహనాల ర్యాలీలు నిర్వహించారు.

తాజావార్తలు