నెహ్రూ మైదానంలో పోలీస్‌ ఉద్యోగార్థుల ప్రాక్టీస్‌కు నిరాకరణ

ఆందోళనకు దిగిన అభ్యర్థులు

వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): హన్మకొండ పట్టణంలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ రహదారిపై ఎస్సై,

కానిస్టేబుల్‌ అభ్యర్థులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. వచ్చే నెల 17 నుంచి రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపిక పక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి కొరకు స్థానికంగా ఉన్న జవహర్‌ లాల్‌ నెహ్రూ మైదానంలో కొన్నాళ్లుగా వివిధ జిల్లాలకు చెందిన పురష, మహిళ అభ్యర్థులు వ్యాయామ సాధన చేస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు దగ్గరపడుతుండడంతో ఈ మైదానంలో అభ్యర్థుల తాకిడి పెరిగింది. దీంతో ప్రాంతీయ క్రీడా వసతి గృహం క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించి అర్భన్‌ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్‌.ధనలక్ష్మి సాధన చేయడానికి వచ్చే అభ్యర్థులకు మైదానంలోకి అనుమతిని నిరాకరించారు. ఈ

క్రమంలో బుధవారం ఉదయం నుంచి మైదానానికి ఒక వైపు ఉన్న గేట్లకు తాళాలు వేసి మరో వైపు డీఎస్‌ఎ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులను ఇచ్చి కొంతమందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతివ్వడంతో మిగతా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డీఎస్‌ఏ అధికారిణికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపైకి వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాపిక్‌ అంతరాయం కలిగింది. దీంతో హన్మకొండ సీఐ తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని డీఎస్‌ఎ అధికారిణిని ప్రశ్నించగా కలెక్టర్‌ ఆదేశాల మేరకే మైదానంలోకి అభ్యర్థులను అనుమతించడం లేదని ఆమె తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభ్యర్థులు కలెక్టర్‌ ముట్టడికి సిద్దమవడంతో పోలీసులు వారిని అడ్డుకొని వ్యాయామ సాధనకు మైదానంలోకి అనుమతించేలా కృషిచేస్తామని హావిూ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.