నేటి నుంచి ‘కోర్టు’ల బహిష్కరణ
కోర్టుల్లో విధులు బహిష్కరణకు పిలుపు
హైదరాబాద్,జూన్ 5(జనంసాక్షి):న్యాయాధికారుల ప్రాథమిక విభజన తీరుకు నిరసనగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించాలని న్యాయవాదుల సంఘం తీర్మానించింది. ఆదివారం న్యాయాధికారులు, న్యాయ ఉద్యోగులు, న్యాయవాదుల సంఘాల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. న్యాయాధికారుల కేటాయింపులపై రేపటి నుంచి ఆందోళన చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావటంతో పాటు, భోజన సమయంలో నిరసన సమావేశాలు, ప్రదర్శనలు చేయాలని ఉద్యోగులు తీర్మానించారు. సామూహిక సెలవు పెట్టేందుకు అనుమతివ్వాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖరాయాలని నిర్ణయించారు. ఐచ్ఛికాల ఆధారంగా హైకోర్టు జరిపిన న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కొంత కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానికత ఆధారంగానే విభజన జరగాలని డిమాండ్ చేస్తున్నారు.