నేటి నుంచి వాడివేడిగా బడ్జెట్‌ సమావేశాలు

3

 

3A
ప్రజా వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తాం…తెరాస

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. ఆర్డినెన్స్‌ వ్యవహారంపై ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది. మత మార్పిడిలు సహా ప్రభుత్వం అనేక అంశాలలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సమావేశాలు ఈ నెల 23 నుంచి మే 8వ తేదీ వరకు రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడతగా ఈనెల 23 నుంచి మార్చి 20 వరకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్‌ 20 నుంచి మే 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. తొలి విడతలో 20 రోజులు, మలి విడతలో 13 రోజుల చొప్పున ఉభయ సభలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాగా ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 27, ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచుతారు. 28న సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెడతారు. తొలి విడత సమావేశాల్లో ఆరు ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోవాల్సి ఉంది. ప్రతి అంశానికి ఆర్డినెన్స్‌ జారీ చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే విమర్శలపాలైంది. బీమా, బొగ్గు రంగాల ఆర్డినెన్స్‌ల స్థానంలో రూపొందించిన బిల్లులకు ఆమోద ముద్ర పొందాల్సి ఉంది. 2015 ఆర్థిక బిల్లు సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. లోక్‌ సభలో 3, రాజ్యసభలో 7 బిల్లులు పెంటింగ్‌లో ఉన్నాయి. వీటిపై కూడా చర్చ జరిగి ఆమోదం పొందాల్సి ఉంది.

ప్రజా వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తాం: తెరాస

రేపటి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో  టీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థంగా ఉంటుందని ఆపార్టీ ఎంపీ వినోద్‌ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే బిల్లుల ఆమోదించుకోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. అయితే అదేసమయంలో ప్రజా వ్యతిరేక బిల్లులను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామన్నారు. రాష్ట్రాల బలోపేతానికి ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ లో కేటాయింపులు ఎలా చేస్తారో చూడాలన్నారు.