నేటి పోలింగ్‌కు భారీగా ఏర్పాట్లు
11మంది పోలీసుల సస్పెన్షన్: ఎస్పీ సునిల్‌దత్
భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్6(జనంసాక్షి): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలో 11మంది స్పెషల్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ సునిల్‌దత్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వివిధ రకాల కారణాలతో సెలవులో ఉన్న సిబ్బంది ఎన్నికల విధులకోసం హజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎస్పీ ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎన్నికల విధులకు హజరుకాని 11మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో ఐదుగురు సివిల్ కానిస్టేబుళ్లు, ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు ఉన్నారు.ఈ నెల 7 తేదీన జరగబోయే ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యేక బలగాలతో పాటు, చత్తస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి సైతం ప్రత్యేక సిబ్బందిని ఈ ఎన్నికల బందోబస్తు విధులకు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 3300మంది పోలీస్ సిబ్బందికి ఈ విధులను కేటాయించారు. జిల్లాలో మొత్తం 999 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో వాటిలో 198 పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి.జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాలలో ఇప్పటికే అనివిధాల జాగ్రత్తలు చేపట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా వీటిలో నుంచి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుని ఆనుకుని ఉన్నందున మావోయిస్టులు ఎటువంటి అలజడులకు పాల్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసున్నారు.