నేడు అంతరాష్ట్రమండలి భేటీ
– ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్
– ప్రధాని, పలువురు మంత్రులను కలువనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్,జులై 15(జనంసాక్షి): నేడు అంతరాష్ట్రమండలి భేటీని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ బయలుదేరివెళ్లారు. ఆయన వెంట పలువురు అధికారులు కూడా ఉన్నారు. శనివారం అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. దిల్లీ పర్యటన సందర్భంగా ఉమ్మడి హైకోర్టు విభజన, తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన, మిషన్ కాకతీయ, భగీరథలకు సాయం తదితర అంశాలను కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రధానంగా హైకోర్టు విబజనపై తక్షణ చర్యలకు ప్రధానిని కోరే అవకాశం ఉంది. ఇదే సందర్బంలో ఢిల్లీలో చంద్రబాబు కూడా హాజరవుతున్నందున ఇద్దరూ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. శనివారం ఢిల్లీలో జరిగే అంతర్‌రాష్ట్ర మండలి సమావేశానికి ఇద్దరూ విచ్చేస్తున్నారు. అయితే… వీరిద్దరూ కలిసి అప్యాయంగా మాట్లాడుకుంటారా… లేక ఎడమోహం, పెడమోహంగా వ్యవహరించుకుంటారా… అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విభజన అనంతరం ఎన్నికై రేండేళ్లు దాటినా వీరిద్దరూ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ కలుసుకున్న సందర్బాలు చాలా తక్కువే. రాజధాని అమరావతి ప్రారంభానికి విచ్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులతో కలిసి కేసీఆర్‌ను ఆహ్వనించారు. అనంతరం కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగంలో ఓసారి, ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ దగ్గర రెండుసార్లు కలుసుకున్నారే తప్ప పెద్దగా వీరిద్దరు కలుసుకున్న సందర్బాలు చాలా తక్కువ. అయితే…తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడ్డంపడుతున్నాడంటూ కేసీఆర్ తోపాటు, ఆయన మంత్రివర్గ సభ్యులు ప్రతి రోజు ఏదో ఒక సందర్బంలో విమర్శిస్తూనే ఉన్నారు. అంతేగాక సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన వంటి తదితర అంశాలపై కూడా చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాడంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల ఇద్దరు చంద్రుల మధ్య కొంత నిశబ్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య అంత సయోధ్య, సఖ్యత లేకపోయినా ఢిల్లీ వేదికగా మళ్లీ వీరిద్దరూ కలుసుకోబోతుండడంతో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాజకీయాల్లో చర్చా వాతావరణం నెలకొంది. వీరిద్దరూ హైకోర్టు విషయంలో ఏదైనా నిర్ణయం తీసేకుంటారా అన్నది చూడాలి.