నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
బెంగళూరు,మే4 (జనంసాక్షి):
కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగ నుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ కోసం 6,200 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం కళిందుకు లక్షా 35 వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. మే 8న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి. ఇందుకోసం అన్ని పార్టీలో పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. బిజెపికి ఈ ఎన్నికలు పరీక్ష కాగా, అధికారం కోసం కాంగ్రెస్‌, జెడి పోటీపడు తున్నాయి. ఇదిలావుంటే ఎవరికి ఓటు వేయాలో నిర్దారించుకొనే అవకాశం, స్వేచ్ఛను ఓటరుకు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. పార్టీలు, మాధ్యమాలు ఓటర్లను ప్రభావితం చేయడం, సవిూక్షలతో తప్పుదోవ   పట్టించడం, ఒత్తిడికి గురిచేయడం వంటివి చేయరాదని కోరారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే నేరంగా పరిగణించాల్సిన వస్తుందన్నారు.  ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని  చెప్పారు. ఇదిలావఉంటే శుక్రవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారానికి గడువు ముగిసింది, తరువాత ఈసీ నిబంధనలకు లోబడి ఇంటింటా ప్రచారం మాత్రం చేసుకోవచ్చని చెప్పారు.  స్వేచ్చాయుత వాతావరణంలో ఈసీ విధులు నిర్వర్తిస్తోందని చెప్పారు.
అసాంఘికశక్తులపై నిఘా
ఎన్నికల పక్రియ ప్రారంభం నుంచి ఇప్పటి  వరకు 6350 మంది రౌడీషీటర్లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఎలాంటి గొడవలకు పాల్పడబోమని మరో మూడువేల మంది రౌడీషీటర్ల చేత లిఖిత పూర్వక హావిూ పత్రాన్ని రాయించుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్లపై నిఘావేశారు. లైసెన్స్‌ కలిగిన ఎనిమిది వేల తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు.  5 తేదీ అర్ధరాత్రి వరకు బెంగుళూరు నగరంలో 144 సెక్షన్‌ విధించారు. కత్తులు, కర్రలు, తుపాకులు తదితర వాటిని పట్టుకుని తిరిగితే అరెస్టు చేస్తారు.
71 మద్యం దుకాణాల లైసెన్సుల సస్పెన్షన్‌
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై బెళగావి జిల్లాలో 71 మద్యం దుకాణాల లైసెన్సులను సస్పెండ్‌ చేసినట్లు జిల్లాధికారి వెల్లడించారు. లైసెన్సుల సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఈనెల 10 వరకు అమల్లో ఉంటాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2.30 కోట్ల నగదు, 16 వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బహిరంగ ఎన్నికల ప్రచారం ముగిసినందున నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. రెండుకు మించి వాహనాలతో వెళ్తే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇదిలావుంటే బీజేపీ కార్యాలయంలో బంగారు ముక్కు పుడకలు ఉండడం కలకలం రేకెత్తించింది.  నగరంలోని వయాలికావల్‌లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఎన్నికల అధికారి నాగరాజు నేతృత్వంలోని బృందం తనిఖీలు చేపట్టారు. 60 బంగారు ముక్కు పుడకలు, నగదు దొరికింది. నగదు వివరాలను అధికారులు వెల్లడించలేదు. విషయం తెలిసిన వెంటనే స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ అభ్యర్థిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.  కృష్ణరాజపురం ప్రాంతంలో కారులో తరలి వెళ్తున్న రూ.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆవాహనం కాంగ్రెస్‌ అభ్యర్థి బదిరతి బసవరాజుదిగా పోలీసులు తెలిపారు. ఇంటి కొనుగోలుకు నగదు తీసుకువెళ్తున్నట్లు కారులోని చంద్ర అనే వ్యక్తి తెలిపారు. దాఖలాలు చూపకపోవడంతో అతడిని అరెస్టుచేశారు.