నేడు కుమారస్వామి బలపరీక్ష

లాంఛనమే కానున్న కార్యక్రమం
స్పీకర్‌,డిప్యూటి స్పీకర్‌కు కూడా ఎన్నిక
బెంగళూరు,మే24(జ‌నం సాక్షి):  జేడీఎస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌ కుమార్‌ పేరును స్పీకర్‌ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. బుధవారం ప్రమాణం చేసిన అనంతరం శుక్రవారం బలపరీక్ష జరుగనుండగా, ఇది కేవలం లాంఛనమే కానుంది. కాంగ్రెస్‌,జెడిఎస్‌కు 116 మంది సభ్యుల బలముంది. ఇదిలావుంటే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ, అమిత్‌షాపై పలు వ్యాఖ్యలు చేశారు. బిజెపి తనను పన్నెండేళ్లుగా ఉపయోగించుకుందని కుమారస్వామి పేర్కొన్నారు. నరేంద్రమోడీ, అమిత్‌షా అశ్వమేథం చేస్తూ విడిచిన గుర్రాన్ని కట్టడి చేస్తామన్నామని, ఇప్పుడు జెడిఎస్‌, కాంగ్రెస్‌ కలిసి ఆ గుర్రాన్ని కట్టడి చేశాయని వివరించారు. ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి దేశవ్యాప్తంగా పలువురు నాయకులు తరలిరావడం చారిత్రాత్మకమని, అయితే ఈ కలయిక లక్ష్యం కేవలం తమకు మద్దతు తెలపడానికి కాకుండా, 2019లో దేశంలో పెద్ద మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనేనని తెలిపారు. బిజెపి నుంచి దేశాన్ని రక్షించడానికి కాంగ్రెస్‌తో తాము చేతులు కలిపినట్లు ఆయన ఉద్ఘాటించారు.  కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యకూటమి వేసిన తొలి అడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయిన సంగతి తెలిసిందే. కన్నడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ప్రాంతీయ పార్టీల మేళాను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షంలో ఉన్న దాదాపు అన్ని పార్టీల నేతలు వేదికపై కనిపించారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి వీరంతా ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నాను. సోనియా, మమతలు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, తేజస్వీ యాదవ్‌ మమత, మాయావతి, సోనియాల పాదాలకు నమస్కరించటం అందరి దృష్టిని ఆకర్షించాయి.
————