నేడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు

0001

సంపూర్ణ మెజారిటీ దిశగా ఆప్‌

రెండో స్థానంలో భాజపా

కాంగ్రెస్‌కు చావుదెబ్బ

తాజా సర్వేల సరళి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠకు గురిచేసిన దిల్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం తేలనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలన్నీ ఆప్‌కు సంపూర్ణ మెజారిటీ వస్తుందని తేల్చేసిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు అనంతరం మధ్యాహ్నం కల్లా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో శనివారం పోలింగ్‌ జరిగింది. ఈవీఎంల నుంచి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు ఢిల్లీ సంయుక్త ఎన్నికల అధికారి రాజేష్‌ గోయల్‌ చెప్పారు. నగర వ్యాప్తంగా మొత్తం 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 12,177 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 20,000 ఓటింగ్‌ యంత్రాలన్నీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్‌రూంలో ఉన్నాయని తెలిపారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలట్లు, తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 10-14 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి టేబుల్‌ వద్ద ఒక పరిశీలకుడు ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇదిలావుంటే  ఢిల్లీలో బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్‌ బేదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ అభ్యర్ధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం బేదీ మిడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌లో వాస్తవం లేదని, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసం ఉందన్నారు. కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ మరికొన్నింటిలో ముందంజలో ఉన్నామన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ గురించి ఆలోచించడం వ్యర్ధమని, ఈ నెల 10 వరకు వేచి చూడాల్సిందేనని బేదీ పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికలపై వచ్చినవి ఎగ్జిట్‌ పోల్‌ రిజల్ట్స్‌ మాత్రమేనని… రేపు రాబోయేవి ఎగ్జాక్ట్‌ (వాస్తవ) ఫలితాలని కేంద్రమంత్రి వెంకయ్య అన్నారు.  అవి బీజేపీకి అనుకూలమని వెంకయ్య ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్‌ పేరుతో వ్యతిరేక ప్రచారం జరిగిందని, ఈ ఫలితాలు ప్రధాని మోదీ పనితీరుకు ప్రామాణికం కాదన్నది గుర్తుంచుకోవాలని అన్నారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు కాంగ్రెస్‌ పార్టీకి చావు దెబ్బలా ఉన్నాయని ఆ పార్టీ ఎన్నికల ప్రచార సారథి అజయ్‌ మాకెన్‌ అభిప్రాయపడ్డారు.  ఐదేళ్ల పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆమ్‌)కి అధికారం ఇవ్వాలని ఓటర్లు భావించినట్లు ఉన్నారని ఆయన అన్నారు.  ఎవరు గెలిచినా ప్రజాస్వామ్య దేశంలో ఆ తీర్పును గౌరవించాల్సిందేనని మాకెన్‌ తెలిపారు. ఆదివారం కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలను కొట్టిపారేయలేమన్నారు. ఒకవేళ అవి మాత్రం నిజమైతే అది తమకు అత్యంత ఆందోళనకరమైన విషయమేనని అన్నారు. అయినా అన్నిసార్లు సర్వేలు నిజమవుతాయనడం ఎంతమాత్రం సరికాదని మాకెన్‌ తెలిపారు.