నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు
చెన్నై,మే15(జనంసాక్షి):దక్షిణాది రాష్ట్రాలైనా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలున్నాయి. కరూర్ జిల్లాలోని అరవ కురుచ్చి అనే నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీస్థాయిలో అవకతవలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఆ నియోజకవర్గంలో పోలింగ్‌ను ఈసీ వాయిదా వేసింది. దీంతో 233 నియోజకవర్గాల్లోనే రేపు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 5.82 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. దీనికోసం 66వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 కంపెనీలకు చెందిన 18వేల పారామిలటరీ సిబ్బంది, 65వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. దాదాపు 4వేల పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు. 3.29లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 234 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 3,776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్, డీఎంకే అధినేత కరుణానిధి తిరువారూర్, డీఎంకే కోశాధికారి స్టాలిన్ చెన్నైలోని కొళత్తూర్, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ వూళుందూర్ నియోజకవర్గాల నుంచి పోటీ ఉన్నారు.కాగా, తమిళనాడు రాష్ట్ర శాసనసభకు మొత్తం 234 సీట్లు ఉండగా, 3,776 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని 5.79 కోట్లకు పైబడిన ఓటర్లు తేల్చనున్నారు. అలాగే, కేరళ అసెంబ్లీకి 140 ఎమ్మెల్యేలను మందిని ఎన్నుకునేందుకు 2.61 కోట్ల మందికి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో 1,203 మంది ఉండగా వీరిలో 109 మంది మహిళలు. అదేవిధంగా 30 సీట్లు పుదుచ్చేరి అసెంబ్లీకి కూడా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పైచేయిలోనే ఉంది. ఇక, సీఎం ఊమెన్ చాందీతో ప్రధాని నరేంద్ర మోడీ మాటల యుద్ధం నేపథ్యంలో బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఖాతా తెరవాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక, మళ్లీ అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్న ఎల్డీఎఫ్‌కు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.