నేడు తెలంగాణ రాష్ర్ట కేబినెట్‌ భేటీ

d9fhcbhe  హైదరాబాద్: ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతున్న తరుణంలో నేడు టీఎస్‌ క్యాబినెట్ భేటీ జరుగనుంది. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలు తీరు తెన్నులపై కేబినెట్‌ భేటిలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై నెలకొన్న అభిప్రాయంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీయనున్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ నిర్మించేందుకు అవసరమైన స్థల సేకరణ, ఓయూ భూములపై ప్రతిపక్షాల రద్దాంతంపై కూడా చర్చించనున్నారు. హరితహారం, ఐటీ పాలసీలపై, త్వరలో ప్రకటించబోయే ఇండ్రస్ర్టీ పాలసీపై కూడా కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.తెలంగాణ రాష్ర్టం, ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశముంది. 58 జీఓ కింద భూముల క్రమబద్ధీకరణ, జీఓ 59కు వస్తున్న అడ్డంకులు, ఉద్యోగాల భర్తీ, స్వచ్ఛ హైదరాబాద్‌ను రెగ్యూలర్‌ కార్యక్రమంగా మార్చే అంశంతో పాటు ఇతర జిల్లాల్లో స్వచ్ఛ తెలంగాణను చేపట్టాలనే అంశాలపై కూడా చర్చిస్తారని సమాచారం.యాదాద్రి అభివృద్ధి ప్రణాళికపై కూడా కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. దాంతో పాటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఎదుర్కొనే దిశలో పలు సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. ప్రధానంగా నిరుద్యోగులను సంతృప్తి పర్చేలా ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసే యోచనలోఉంది. దళితులకు మూడెకరాల భూముని పంచే స్కీమ్‌ను మరింత వేగవంతంగా అమలు పర్చాలన్న అభిప్రాయంలో ఉంది. ఇక హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లే ఇతర పట్టణాల్లో చేపట్టాలని సర్కార్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా స్కీమ్‌లకు కేబినెట్‌ ముహుర్తాన్ని ఖరారు చేయనుంది.