నేడు నగరానికి ప్రధాని, సోనియా

బాంబు పేలుళ్ల బాధితులకు పరామర్శ
హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ ఆదివారం నగరానికి రానున్నారు. దేశం మొత్తాన్ని హైదరాబాద్‌ జంట బాంబు పేలుళ్లు కుదిపేశాయి. ఘటన జరిగిన వెంటనే ప్రధాని పర్యటించాల్సిన ఉన్నా పార్లమెంట్‌ భద్రత సమావేశాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మాత్రమే ఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఆదివారం పార్లమెంట్‌కు సెలవు కావడంతో బాధితులు, మృతుల బంధువులను పరామర్శించాలని ప్రధాని, సోనియా నిర్ణయించారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, యశోద, ఓమ్ని తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ప్రభుత్వం, కాంగ్రెస్‌ తరఫున భరోసా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు వారిద్దరు ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా దిల్‌సుఖ్‌నగర్‌ని పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి, హోం మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమై బాంబు పేలుళ్ల వివరాలు, విచారణ, నిందులను పట్టుకునేందుకు చేపట్టిన చర్యలపై చర్చిస్తారు. ప్రధాని మన్మోహన్‌, సోనియాగాంధీ పర్యటన నేపథ్యంలో ఎన్‌ఎస్‌జీ అధికారులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేకంగా సమావేశమై చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అయితే వీరిద్దరి పర్యటన కేవలం రెండు, మూడు గంటలకే పరిమితం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి.