నేడు నర్మెటలో గొల్లకురుమల ఆత్మీయసదస్సు
కొమురవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్
జనగామ,నవంబర్24(జనంసాక్షి): గొల్లకుర్మల ఆత్మగౌరవాన్ని నిలిపి, వారికి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం టిఆర్‌ఎస్ అని కొమురవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్ అన్నారు. గతంలో ఎప్పుడు కూడా గొల్లకుర్మలను ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. ఈ నెల 25న నర్మెట మండల కేంద్రంలో గొల్ల కురుమల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీలు గొల్లకురుమల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్ హయాంలోనే వారికి సముచిత స్థానం లభించిందన్నారు. అందులో భాగంగానే గొల్లకురుమల ఆరాధ్యదైవమైన కొమురవెల్‌ల్లి దేవస్థానం చైర్మన్ పదవి కురుమలకు కేటాయించారన్నారు. అలాగే గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎక్కడా లేని విధంగా గొర్రెలను రాయితీ పై ఇచ్చారని గుర్తుచేశారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన
పొన్నాల లక్ష్మయ్య బీసీలకు చేసిందేవిూ లేదని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో జనగామ నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆత్మీయ సభకు తరిగొప్పుల, నర్మెట మండలాల్లోని అన్నిగ్రామాలనుంచి గొల్లకురుమలు పాల్గొని విజయవంతంచేయాలని ఆయన కోరారు.