నేడు హైదరాబాద్‌కు ఆపిల్ సీఈవో
– మన రాజధాని కేంద్రంగా గూగుల్ తరహా సేవలు
హైదరాబాద్,మే18(జనంసాక్షి): మంత్రి కేటీఆర్ హాయంలో కొంతపుంతలు తొక్కుతున్న ఐటీ పరిశ్రమలో మరో కిలికితురాయి చేరనుంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఆపిల్ రేపు తన డెవలప్ మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఘనంగా ఆరంభించనుంది. నానక్ రామ్ గూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో దాదాపు రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ డెవలప్ మెంట్ సెంటర్ ఆరంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ హాజరు అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే డెవలప్ మెంట్ సెంటర్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఐటీ విధానంతో ఆపిల్ తమ కార్యకలాపాలు భాగ్యనగరంలో నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు డెవలప్ మెంట్ సెంటర్ ఆరంభోత్సవానికి ఆపిల్ సంస్థ అత్యున్నతస్థాయి వ్యక్తులు భాగ్యనగరానికి రానున్నారు. ఇప్పటికే భారత పర్యటనలో ఉన్న సీఈఓ టిమ్ కుక్ షెడ్యూల్ ఇవాళ ఖరారు కానుంది.ఇక ప్రతిష్టాత్మక ఆపిల్ సంస్థ డెవలప్ మెంట్ సెంటర్ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాకారం అందిస్తామని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. ఇక ఈ డెవలప్ మెంట్ సెంటర్ కోసం ఆపిల్ సంస్థ దాదాపు వంద కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ భారీ టెక్నాలజీ డెవలప్ మెంట్ కేంద్రంతో పాటు బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ సెంటర్ గా హైదరాబాద్ ను ఆపిల్ తీర్చిదిద్దే అవకాశాలున్నాయి.భారతదేశంలో సింగిల్ బ్రాండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆపిల్ సంస్థ తమ కేంద్రం ఏర్పాటుకోసం హైదరాబాద్ ను ఎంచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఐటీ పాలసీపై ఆపిల్ సంస్థ సంతృప్తితో ఉంది. ఇక ఈ డెవలప్ మెంట్ సెంటర్ లో దాదాపు 2 వేల 500 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. సెజ్ లో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు అవకాశం ఉంది. ఇక గతేడాది భారత్ లో ఆపిల్ అమ్మకాలు 6 వేల 800 కోట్లు దాటాయి. భారత్ లో తమకు భారీ స్థాయిలో ఆదరణ దక్కుతుండటంతో హైదరాబాద్ లో సంస్థ ఏర్పాటుకు ఆపిల్ ముందుకొచ్చింది.ఓవరాల్ గా హైదరాబాద్ ఇండియాకే ఐటీ హబ్ గా మారుతోంది. మంత్రి కేటీఆర్ హాయంలో ప్రవేశ పెట్టిన నూతన ఐటీ పాలసీ దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తోంది. దీంతో భాగ్యనగరాన్ని కేంద్రంగా చేసుకునేందుకు భారీ సంస్థలు క్యూ కడుతున్నారు. భారీ పెట్టుబడులతో తమ సంస్థలను ఇక్కడ నెలకొల్పుతున్నాయి