నేతాజీకి రాష్ట్రపతి ఘన నివాళి

1

న్యూఢిల్లీ,జనవరి23 (జనంసాక్షి):  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి వందనం సమర్పించారు. నేతాజీ 118వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలను మోదీ కొనియాడారు. ‘ఆయన ధైర్యం, తెగింపు, దేశభక్తి మా హృదయాల్లో స్ఫూర్తిని నింపాయి. ఆయన పుట్టిన ఈ దేశంలో నేను  పుట్టినందుకు గర్వపడుతున్నాను. బోస్‌ నిర్వహణ, నాయకత్వ లక్షణాలు ఎంతో ఉత్తేజపూరితమైనవి. ఆయనొక ప్రత్యేకమైన వ్యక్తి ‘ అని మోదీ  తన సందేశాన్ని తెలియజేశారు. రాష్ట్రపతి,ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు నేతాజీకి నివాళులర్పించారు. విశాఖలో నేతాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. నేతాజీ 118వ జయంతి సందర్భంగా బీచ్‌రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను కేంద్రమంత్రి జెండా వూపి ప్రారంభించారు.