నేతాజీ కుటుంబంపై 20 ఏళ్లు భారత గూఢచార్య సంస్థల నిఘా

    isklzzft
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై కేంద్ర నిఘా సంస్థ నిఘా పెట్టి ఉంచిందన్న వార్త ఇప్పుడు ఓ పెద్ద రాజకీయ వివాదంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా రెండు దశాబ్ధాలపాటు ఇంటలెజెన్స్ నిఘా కొనసాగింది. దేశ స్వాతంత్ర్యానికి పాటు పడిన వీరుడి ఇంటిపై నిఘాపెట్టింది. శత్రుదేశమో లేక బ్రిటీష్ వ్యవస్థో కాదు. సాక్షాత్తు భారత ప్రభుత్వమే.. అప్పటి ప్రధాని జవహర్ లాల నెహ్రూ కావడం జనాన్ని విస్మయానికి గురి చేసింది. వివరాలిలా ఉన్నాయి. 
‘నాకు జవహర్‌లాల్ నెహ్రూ చేసినంత నష్టం మరెవరూ చేయలేదు’’ నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన అన్న కుమారుడు అమీయనాథ్ బోస్‌కు 1939లో రాసిన ఓ లేఖలోని సారాంశం ఇది. ఇన్నేళ్ల తర్వాత ఈ లేఖ బయటపడింది. ఆ లేఖ బయట పడడంతో అనే అంశాలు వెలుగు చూశాయి. నేతాజీ కుటుంబంపై ఏకంగా రెండు దశాబ్దాల పాటు భారత ప్రభుత్వం గూఢచర్యం చేయించింది. ఇందులో ఎక్కువ భాగం.. 16 ఏళ్లు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారత ప్రధానిగా ఉన్న కాలం కావటం గమనార్హం. 
నేతాజీకి సంబంధించిన పత్రాలలో కొన్ని పశ్చిమబెంగాల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ముఖ్యకార్యాలయంలో ‘అత్యంత రహస్య పత్రాలు’గా ఉండిపోయాయి. బెంగాల్ ఐబీ ఆఫీసులోని ఈ పత్రాలను ‘రహస్య పత్రవిభాగం’ నుంచి కేంద్ర హోం శాఖ తొలగించటంతో వాటిని ఢిల్లీలోని  జాతీయ ప్రాచీన దస్తావేజుల భాండాగారం(నేషనల్ ఆర్కైవ్స్)కు తరలించారు.
 దీంతో ఈ పత్రాలలోని సమాచారం బహిర్గతమైంది. వీటిలో కొంత సమాచారాన్ని నేతాజీ కుటుంబ సభ్యుడు, టీఎంసీ ఎంపీ సుగతా బోస్ సేకరించారు. వీటి ప్రకారం 1948 నుంచి 1968 వరకు సుభాష్ అన్న శరత్‌చంద్రబోస్ కుమారులు శిశిర్ కుమార్ బోస్, అమీయ నాథ్ బోస్‌లపై భారత ప్రభుత్వం నిఘా నిర్వహించింది. బోస్ కుటుంబం నివసించే కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లోని 38/2 వుడ్‌బర్న్ పార్క్ ఇళ్లపై ఐబీ నిరంతర గూఢచర్యం చేసింది. వీరిద్దరూ నేతాజీకి చాలా దగ్గరి వాళ్లు కావటం వల్ల వారి ప్రతి కదలికనూ ఐబీ వర్గాలు నీడలా పరిశీలిస్తూ వచ్చాయి. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లినా, విదేశాలకు వెళ్లినా.. ఎవరితో మాట్లాడినా.. నీడలా వెంటాడాయి.