నేత కార్మికులకు శుభవార్త

లక్షలోపు వడ్డీలేని రుణాలు : సీఎం కిరణ్‌
తలెత్తుకు బతికేలా చూస్తాం : కావూరి
హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) :
నేత కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. లక్ష రూపాయల్లోపు రుణాలు తీసుకునే చేనేత కార్మికులు వడ్డీ చెల్లించనవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇంతకు ముందు 50వేల రూపాయలు వరకు లోన్‌ తీసుకుంటే 3 శాతం వడ్డీ చెల్లించేవారు. ఇకనుంచి లక్ష రూపాయల్లోపు రుణం తీసుకుంటే అసలు కడితే సరిపోతుందని సీఎం అన్నారు. వారి తరఫున ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో శుక్రవారం రాష్ట్రస్థాయి చేనేత, హస్త కళాకారుల సదస్సు నిర్వహించారు. సదస్సులో కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రి ప్రసాద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తోడ్పడతారన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇంటిగ్రేటెడ్‌ పార్కును ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటికే రూ.400 కోట్ల మేర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  చేనేత కార్మికుల కోసం ఏదైనా చేసేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే అందరికీ ప్రయోజనకరమైన, పారదర్శకతతో కూడిన నిర్ణయాలను తీసుకుంటామని తెలిపారు. సమస్యలను కేంద్రమంత్రి కావూరి, రాష్ట్ర మంత్రి ప్రసాద్‌ కుమార్‌ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి చేనేత కార్మికుల ప్రతినిధులకు సూచించారు. అందరికీ లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ, చేనేత కార్మికుల సమస్యలు తనకు తెలుసునన్నారు. వాటిపై ఇప్పటికే అధ్యయనం చేశానని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని అన్నారు. చేనేత కార్మికులు సమాజంలో గౌరవంగా బతికేలా కృషి చేస్తానని అన్నారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి చేదోడుగా ఉంటానని హామీనిచ్చారు. వారి రుణాలను మాఫీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశానని అన్నారు.