నేను అన్నా హజారే వారసుణ్ణి

4

ఆయన దీవెనలు నాకే : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి4(జనంసాక్షి): సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే తనకు ఆశీర్వాదాన్ని అందించారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ తెలిపారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేజీవ్రాల్‌ ఎన్డీటీవీకిచ్చిన ఓ ఇంటర్యూలో మాట్లాడారు. గాంధేయవాది,సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే తనకు దీవెనలు అందించారని అన్నారు. దీవెనలు పబ్లిక్గా కాకుండా వ్యక్తిగతంగా అందించారని పేర్కొన్నారు. అన్నాహజారే 2011 సంవత్సరంలో చేపట్టిన అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్‌ బేడీ, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌లు ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అన్నా హజారే నిర్ణయం మేరకు కేజీవ్రాల్‌ ఆప్‌ పార్టీని ఆవిష్కరించిన విషయం విదితమే. ఇదిలావుంటే  హైకోర్టులో ఆప్‌ నేత కేజీవ్రాల్‌ కు ఊరట లభించింది. ఓటర్‌ జాబితా నుంచి కేజీవ్రాల్‌ పేరును తొలగించడం కుదరదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎన్నికల తర్వాత ఈసీని ఆశ్రయించాలని కోర్టు కేజీవ్రాల్‌ కు సూచించింది. దిల్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో భాజపా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ భాజపా అభ్యర్థులకు మద్దతుగా గురువారం రెండు ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర విూడియా కన్వీనర్‌ హర్షవర్థన్‌ పటేల్‌ తెలిపారు. గుజరాత్‌కు చెందిన మరికొందరు భాజపా నేతలు, మంత్రులు సైతం ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. ఇక దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. నిఘా బృందాలు ఇప్పటివరకు మొత్తం రూ.32 లక్షల నగదు, 34వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.