నేను గెలిస్తే ఇండియా ఉద్యోగులు ఇంటికే

2

– డొనాల్డ్‌ ట్రంప్‌ అసహన వ్యాఖ్యలు

కొలంబియా,ఫిబ్రవరి 28(జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. నెవేడా కాకస్‌ రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ ఊపులో ఉన్న ట్రంప్‌, భారత్‌ పై తన విమర్శలనే తన అస్త్రాలుగా చేసుకుని ప్రచారంలో మరింత ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే… అలా చేస్తే భారత్‌ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు జరిగిన నాలుగు ప్రైమరీ ఎన్నికల్లో మూడింటిని ట్రంప్‌ కైవసం చేసకున్న విషయం తెలిసిందే. సౌత్‌ కరోలినా, న్యూ హాంప్‌షైర్‌, నెవేడాలలో ట్రంప్‌ ముందంజలో ఉండగా.. అయోవా కాకస్‌లో మాత్రం ట్రంప్‌ను రెండో స్థానంలోకి నెట్టి క్రుజ్‌ గెలిచారు.  69 ఏళ్ల ఈ రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం గతేడాదే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. కొలంబియాలోని స్థానిక ఎయిర్‌ పోర్టులో ప్రసంగించారు. అమెరికాను మరోసారి గ్రేట్‌ అనిపించేలా చేస్తామని వ్యాఖ్యానించారు. భారత్‌, చైనా, జపాన్‌ లాంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని.. తాను గెలిస్తే అమెరికాలోని ఆ ఉద్యోగులను తొలగిస్తానని లాస్‌వెగాస్‌ ర్యాలీలో చెప్పిన విషయాన్ని ఇక్కడ పునరుద్ఘాటించారు. రోజురోజుకు అతని విజయావకాశాలు మెరుగు పరుచుకుంటూ సాగుతున్నాడు. కొలంబియాలో ఉపన్యాస వేదిక ప్రాంగణంలో అయితే  ‘అమెరికా.. అమెరికా’, ‘ట్రంప్‌.. ట్రంప్‌’ అనే నినాదాలతో మార్మోగిపోయింది. తర్వాత ఎన్నికలు జరగనున్న టెక్సాస్‌ లోనూ విజయం తనదేనని ట్రంప్‌ ధీమాగా ఉన్నారు . అమెరికా సరిహద్దు ప్రాంతం మెక్సికో చుట్టూ రక్షణ గోడను ఏర్పాటు చేసి వలసలకు అడ్డుకట్ట వేస్తామని ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లిన వారు, ట్రంప్‌ హావిూలతో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఉన్నాడని ఆందోళన చెందుతున్నారు.