నేను పూజలుచేస్తే.. మోడీ ముల్లేంపోయింది

 

– కేసీఆర్‌ను ఓడించడానికి.. అందరు ఏకమైయ్యారు

– దేశంలో రెండు పార్టీల దరిద్రం పోవాలి

– రాష్ట్రాలతో కలిపి వచ్చే ఫెడరల్‌ ఫ్రంట్‌ రావాలి

– వనపర్తి సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

వనపర్తి, నవంబర్‌27(జ‌నంసాక్షి) : నేను పూజలుచేస్తే ప్రధాని మోడీ ముల్లె ఏం పోయిందని, నాకు భక్తి ఉంది.. దేవున్ని నమ్ముతా.. నీకు భక్తి ఉంటే నువ్వు కూడా ఇక్కడికి రా తీర్థం పోస్తానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. యాగాలు, పూజలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ప్రధాని మోదీ అన్నారని, నేను పూజలు చేసుకుంటే మోదీ ముల్లె ఏం పోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కరెంట్‌ సమస్య ఉందని మోదీ పచ్చి అబద్దాలు చెప్పిండని విమర్శించారు. సీఎ ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి మోదీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, చంద్రబాబు ఏకమయ్యారన్నారు. ఈ దేశంలో రెండు పార్టీలు దేశానికి దరిద్రంలా పట్టుకున్నాయని, ఆ దరిద్రం పోవాలంటే రాష్ట్రాలతో కలిపి వచ్చే ఫెడరల్‌ ఫ్రంట్‌ రావాలని కేసీఆర్‌ అన్నారు. ఆమేరకు ముందుకు సాగుతానని అన్నారు. వనపర్తి చారిత్రకంగా పెద్ద కల్చరల్‌ సెంటర్‌ అని అన్నారు. వనపర్తి అనేక మంది కవులు, కళాకారులు, మేధావులున్న ప్రాంతమన్నారు. మేము ప్రజలను నమ్ముకున్నామని, మద్యం సీసాలను కాదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ కాలంలో కరెంట్‌ ఎట్ల ఉండేదో విూకందరికీ తెలుసన్నారు. ఇపుడు ఒక్కనిమిషం కూడా కరెంట్‌ పోకుండా 24గంటలు కరెంట్‌ అందిస్తున్నామని, భారతదేశంలో రైతులకు ఉచితంగా 24గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్‌ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఎందుకు ఇవ్వడం లేదో మోదీ చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. నిరంజన్‌రెడ్డి పట్టుబట్టి చెరువులు నింపిండు. వనపర్తి జిల్లా కేంద్రం అయింది కాబట్టి ట్రిపుల్‌ ఐటీ, మెడికల్‌ కాలేజీ వస్తాయన్నారు. నిరంజన్‌ రెడ్డిని గెలిపిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండడని.. ఆయన స్థాయి పెరుగుతదని అన్నారు. నిరంజన్‌ రెడ్డిని గెలిపించుకుని వనపర్తిని మరింత అభివృద్ధి చేసుకోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.