నేను విచారణకు సిద్ధం

తప్పు తేలకపోతే బాబు, రాధాకృష్ణ కాళ్లు పట్టుకోవాలి : కేటీఆర్‌
హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) :
‘నేను విచారణకు సిద్ధం.. భూ దందాలో నా తప్పు తేలకపోతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నా కాళ్లు పట్టుకోవాలి’ అని కేసీఆర్‌ అధినేత తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తీవ్రస్వరంతో హెచ్చరించారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పిచ్చిరాతలతో అడ్డుకోవాలనే ప్రయత్నాలు విఫలం కావడంతో వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగుతున్న రాధాకృష్ణకు ఏమాత్రం దమ్మున్నా విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. తనపై సీబీఐతో కాదు కదా ఎఫ్‌బీఐతో కూడా విచారణ చేయించాలని సవాల్‌ విసిరారు. ఒకవేళ తాను ఏ తప్పూ చేయలేదని తేలితే చంద్రబాబు, రాధాకృష్ణ తన కాళ్లు పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. పలు ఆరోపణలపై విచారణలు జరుగకుండా స్టేలు తెచ్చుకున్న పార్టీకి అధినేత అయిన చంద్రబాబు అమెరికా నుంచి పెంపుడు కుక్కలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రెండు ఎకరాలున్న అతడి కుటుంబం, రెండు వందల ఎకరాలున్న తమ కుటుంబంపై సమగ్రంగా విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏమాత్రం చిత్తశద్ధి ఉన్నా కూడా చంద్రబాబు ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. పెంపుడు కుక్కలను నివారించి తన సవాల్‌ను స్వీకరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ముక్కుసూటిగా చేస్తున్న సవాల్‌ను స్వీకరించి ముందుకు వచ్చి అనవసర ఆరోపణలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవితంలో ఏనాడూ కూడా ఒక్క నిజాన్ని కూడా చెప్పని చంద్రబాబు, ఈసారైనా విచారణకు ముందుకు రావాలన్నారు. వ్యక్తిగత విమర్శలకోస్తే ఆంధ్రజ్యోతి ఎండీ రాదాకృష్ణ బతుకు ఏంటో ఎలా పత్రికాధిపతి అయ్యాడో కూడా విచారణకు సిద్ధంగావాలని అన్నారు. దొంగకోళ్లు, దొంగ బియ్యం గాడిదలపై మహారాష్ట్రకు తరలించి అమ్ముకున్న చరిత్ర ఎవరికీ తెలియదనుకోవడం అవివేకమన్నారు. పదేళ్లక్రితం వరకు కూడా మామూలు ద్విచక్ర వాహనంపై అసెంబ్లీకి ఓ గుమాస్తాగా విలేఖరి పోస్టులో పనిచేసిన ఆయన ఎలా ఎదిగింది, కోట్లు ఎలా సంపాదించుకున్న వైనంపై కూడా విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు. తనపై రాసిన కథలు, ప్రసారం చేసిన కథనాలపై 14గంటలపాటు సమయం వెచ్చించిన నీవు కొండను తవ్వి ఏం వెలికి తీసావో ప్రజలందరూ చూశారన్నారు. కనీసం ఎలుకను కూడా పట్టుకోలేదన్నారు. పత్రికల ద్వారా చేసిన సూచనమేరకు సోమవారం పరువు నష్టం దావా వేయడమేకాక, క్రిమినల్‌, సివిల్‌ కేసులు కూడా వేస్తున్నానన్నారు. పచ్చకామెర్ల వ్యక్తి అయిన రాధాకృష్ణకు తొత్తులుగా మారుతూ టిడిపి నేతలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. పిచ్చిపిచ్చి ఆరోపణలు మానుకోక పోతే టీడీపీ నేతలకు కూడా పరువు నష్టం దావా కేసులు తప్పవని కేటిఆర్‌ హెచ్చరించారు. ఇప్పటికైనా చెపుతున్నా పూర్తిస్థాయిలో ఇరుకుటుంబాలపై సమగ్ర విచారణ చేయించుకుందాం అంటూ చంద్రబాబుకు సూటిగా సవాల్‌ విసిరారు.