నేనూ, జనంసాక్షి తెలంగాణ పక్షపాతం
అందుకే గోవా నుంచి వచ్చాను
ప్రజలతో సంబంధంలేని రాతలు పుక్కిట పురాణాలు
పత్రికలు ప్రజల భావావేశాలు పంచుకోవాలి
భగత్, లోహియా విలువల సాధనకు కృషిచేద్దాం
తెలంగాణ ఆవశ్యకతను తెలుగువారందరికీ చాటిచెప్పండి
జనంసాక్షి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది
గోవా లోకాయుక్త జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి
కరీంనగర్, మార్చి 23 (జనంసాక్షి) :
‘నేను, జనంసాక్షి తెలంగాణ పక్షపాతం. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గోవా నుంచి వచ్చాను’ అని గోవా లోకాయుక్త జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం నగర శివారులోని చింతకుం టలో గల జనంసాక్షి ఎడిషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, పత్రికలు రచయితలు ప్రజలతో సంబంధంలేని ఏ రాతలు రాసినా అవి పుక్కిటిపు రాణాలేనని అన్నారు. విలేకరులు, సంపాదకులు ఈ విషయంలో బాధ్యతతో మెలగాలని హితవు పలికారు. విలేకరులు రాసేవి వార్తలు కావని, చరిత్ర ముసాయిదా అని శ్లాఘించారు. ప్రజల ఉద్యమాలను ప్రజల పోరాటాలను ప్రజల ఆరాటాలను పంచుకున్న పత్రికలు చిరస్థాయిగా ప్రజల మన్ననలు పొందు తాయని చెప్పారు. ప్రజల పక్షం వహించే పత్రికలే.. పత్రికలని, రాజకీయ పార్టీలకు కొమ్ముగాయడం తగదని అన్నారు. కొన్ని పత్రికలు దుష్ప్రచారానికే ప్రాధాన్యమిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని, అలా కాకుండా జనంసాక్షి నిజాన్ని నిర్భయంగా చెప్తామంటూ ముందకురావడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. దినపత్రికల్లో ఈరోజు వార్తలు, మరుసటి రోజు రావడం చూస్తుంటామని, కొద్ది క్షణాల ముందు తీసిన ఫొటోలు, సంఘటన వార్తగా రావడం అద్భుతమని అన్నారు. ప్రపంచంలో అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతుం టాయని అన్నారు. జనంసాక్షి ఈరోజు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిందని అన్నారు. సర్దార్ భగత్‌సింగ్ బలిదానం రోజు, రామ్ మనోహర్ లోహియా జన్మదినం కాకతాళీయంగా ఎడిషన్ ప్రారంభోత్సవం జరిగినప్పటికీ మనం వారి ఆదర్శలను, విలువలను ముందుకుతీసుకుపోయేందుకు కంకణం కట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అవకాశం తనకు లోకాయుక్త ద్వారా వచ్చిందని, జనంసాక్షికి తెలంగాణ పక్షపాతం వహించే బాధ్యత కూడా పత్రికద్వారా ఏర్పండిందన్నారు. శాతవాహన నగరం, మానేరుతీరంలో ప్రజా ఉద్యమాలు, ప్రగతిశీల ఉద్యమాలకు ఊపిరిపోసుకున్న కేంద్రంలో జనంసాక్షి పుట్టడమే ప్రజాపక్షమని తేలిపోయిందని అన్నారు. జనంసాక్షి మేనేజింగ్ డైరెక్టర్ ముస్లిం వర్గానికి చెందిన వారైనప్పటికీ తెలుగులో పత్రిక తీయడం మన లౌకక విధానాల్లో ఉన్న బలీయమైన ఆలోచనలను తెలుపుతుందన్నారు. ముస్లింలు ప్రజాఉద్యమాలకు దూరంగా ఉంటారనే అభిప్రాయాన్ని పారదోలేందుకు పత్రికను తెలుగులో ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ షేక్ అబూబకర్ ఖాలిద్ తనతో అనడం ఎంతో గొప్ప విషయమన్నారు. తెలుగు భాష, ప్రజల భాష అని ముస్లిం మైనార్టీలు కూడా తెలుగులోనే చదవడం, రాయడం చేస్తున్నారని, అందుకే తానీ పత్రికను ఉర్దూలో కాకుండా జనమాధ్యమంలో ప్రారంభించానని చెప్పడం ఆయన గొప్పతనాన్ని చాటుతుందన్నారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని చాటడం కోసం ముస్లింలు తెలంగాణ పోరాటంలో ఉన్నారని చెప్పడం కోసం జనంసాక్షిని ఆయన ప్రారంభించడం హర్షణీయమని కొనియాడారు. ముస్లింలలో కొద్దిమంది మాత్రమే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని, వారి భావాలు మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించడం సరికాదన్నారు. జనంసాక్షి పెట్టుబడిదారుల విషపుత్రిక కాదని, విలేకరులు, సంపాదవర్గం మానస పుత్రిక అవుతుందని అన్నారు. జనంసాక్షి యజమాని ఎప్పుడు కూడా సొంత ప్రచారాన్ని కోరుకోలేదని , నిబద్ధతతో ప్రజాపక్షం వహిస్తే చాలని లాభాలు కూడా అవసరం లేదని చెప్పడం ఆయన ఎంత సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తాన్నారో చెప్పకనే చెప్పుతుందన్నారు. ప్రసుత్తం ఏ పత్రిక చూసినా పెట్టుబడిదారుల విషపుత్రికలుగానే ఉన్నాయని, మంచిని చెడుగా, చెడును మంచిగా చూపుపెడుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలకు కొమ్ముకాసి కాంట్రాక్టులు సంపాదించి, పెట్టుబడులు పెట్టి, ఇతర పరిశ్రమలు స్థాపించి పత్రిక పేరుచెప్పుకొని లాభాలు గడిస్తున్నారని అదే మూసలో జనంసాక్షి పోకూడదని చెప్పారు. తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతిని, ప్రజల పోరాటాన్ని, ప్రజల ఆరాటాన్ని అర్థం చేసుకొని ముందుకుపోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలంగాణ ప్రజలకేకాకుండా, తెలుగు ప్రజలందరికీ తెలియజేసే బాధ్యత జనంసాక్షి తన భుజస్కందాలపై వేసుకోవాలని, ముఖ్యంగా ఈ బాధ్యతను ఎడిటర్ రహమాన్ త్రికరణ శుద్ధితో ఆచరించాలని కోరారు.
జిల్లా, సెషన్స్ జడ్జి వి. జయసూర్య మాట్లాడుతూ, భావవ్యక్తీకరణలో నిజాయితీ కోల్పోతే ఆ సమాజమే కుళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతలను పారదోలేందుకు భావ ప్రకటన స్వేచ్ఛను నిర్భయంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలకు సంబంధించిన సంపద ప్రజలకు చెందేలా కలంతో పవిత్రయుద్ధం చేయాలని ఆయన అభిలాషించారు. సమాజ అభివృద్ధికి పత్రికలు, విలేకరులు త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు. కవి, రచయిత, జిల్లా సెషన్స్ జడ్జి మంగారి రాజేందర్ (జింబో) మాట్లాడుతూ, జనంసాక్షి రథసారథులిద్దరూ ఉర్దూ మాతృభాషకు చెందిన వారు ఈ పత్రికలో రాసేవారు తెలుగువారు. రాసేది ఉర్దూ భాష గురించి, ఉర్దూ కవుల గురించి, ఇదొక వింత సమ్మేళనం. మనం భాషలు వేరైనా మనమంతా ఒక్కటే అని చాటిచెప్పే వేదికే జనంసాక్షి. విభిన్న సంస్కృలున్నా మనమంతా ఒక్కటేనని ఎండీ షేక్ అబూబకర్ చాటిచెప్తున్నారు. కరీంనగర్ నుంచి పురాణం సుభ్రమణ్యం శర్మ చిత్రిక పత్రికను, విజయ్‌కుమార్ జీవగడ్డను ప్రారంభించారు, వీరివల్ల ఎంతోమంది జర్నలిజంలో ఎదిగారు. ఇప్పుడు జనంసాక్షి వల్ల ఎంతోమంది సమాజ వీక్షకులను జర్నలిస్టులను అందించేవీలవుతుందని, వందలాది మందికి ఉపాధి దొరుకుతుందని కొనియాడారు. జనంసాక్షి పత్రిక లాభాపేక్షతో నిర్వహించడం లేదని చెప్పడానికే ఈ వేదిక ఒక ప్రబల ఉదాహరణ అని విశ్లేషించారు. జడ్జిలను మాత్రమే ఆహ్వానించారని, వీరివల్ల ఆర్థికపుష్టి కలగతదని, కేవలం హార్దికంగా అభినందనలు మాత్రమే లభిస్తాయని అన్నారు. పొద్దున్నే జనంసాక్షిలో పడ్డ తన రచనలను చూసి నిజామాబాద్, జనగామ, నర్సంపేట నుంచి ఎంతో మంది మిత్రులు తనకు ఫోన్ చేస్తారని చిన్నగా ప్రారంభమై అంత తొందరగా కరీంనగర్ నుంచి మారుమూల ప్రాంతాలకు ఎలా వెళ్తుందని తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు మాట్లాడుతూ, సల్వాజుడుంపై కథనాలు రాసి వారి అకృత్యాలను ఎండగట్టిన రహమాన్ నేతృత్వంలో వస్తున్న జనంసాక్షి మరింత ముందుకుపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్‌మనోహర్‌లోహియా, జయప్రకాశ్ నారాయణ ఆదర్శాలతో పత్రిక నడవాలన్నారు. తాను మొదట గోల్కోండ పత్రిక విలేకరిగా పనిచేశానని, కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా తానే ప్రారంభించానని తన అనుభావాలను పంచుకున్నారు. హైదరాబాద్‌లో ఎడిషన్ ప్రారంభించి దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ, భగత్‌సింగ్ బలిదానం రోజు ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న జనంసాక్షి రవి అస్తమించని బహుళజాతి సంస్థల తుదముట్టించేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను పత్రికారంగం విస్మరించిందని, ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే న్యాయమైన హక్కును పత్రికలు గౌరవించాలన్నారు. సడక్‌బంద్ సందర్భంగా తొమ్మిదివేల మందిని పోలీసులను మోహరించి నిర్బంధం పెట్టి తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేసి తప్పుడు కేసులు పెడితే సీమాంధ్రుల నేతృత్వంలోని పత్రికలు కిమ్మనకుండా ఉన్నాయని అన్నారు. సడక్‌బంద్ విఫలమంటూ ఉద్యమాన్నే కించపరుస్తూ రాతలు రాశాయని చట్టసభలు న్యాయవ్యవస్థ పోలీసులు, నిర్బంధం అణచివేతకు పాల్పడుతుంటే పత్రికలు వాటికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సింది పోయి బాకాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ నేలలో తొలి సాంస్కృతిక పునాదులు ఉన్నాయని, బౌద్ధం ఇక్కడే పెరిగిందని అనభేరి ప్రభాకర్‌రావు, గట్టేపల్లి మురళి పోరాట యోధులను అందించిన నేలయని కొనియాడారు. జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు సింగరేణి కార్మికుల ఆకలి పోరాటాలు ఎన్నో చారిత్రక గట్టాలు ఉన్న కరీంనగర్‌లో ఇప్పుడు ప్రకృతి విధ్వంసం జరుగుతుందని, ప్రజల వారసత్వ సంపద, వారి కళ్ల ముందే దోపిడీకి గురవుతుందని అందుకే జనంసాక్షి వీటికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయని అన్నారు. తెలుగు నేలంతా జనంసాక్షి ప్రభంజనం కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎడిటర్ రహమాన్ మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన వార్తారచనలు చేస్తామని గత ఏడాదిన్నరగా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ స్థిరంగా ఒక్కోమెట్టూ ఎదుగుతూ వెళ్లామని చెప్పారు. ఏ రాజకీయ పార్టీకి ఏ వర్గానికి బాకాగా కాకుండా ప్రజల అభిప్రాయాలను ప్రజాసంక్షేమం కోసం కూడగడుతూ, వారిని చైతన్య పరిచేందుకు అక్షరాలను ఆయుధాలుగా ఎంచుకున్నామని వివరించారు. జనంసాక్షి మేనేజింగ్ డైరెక్టర్ షేక్ అబూబకర్ ఖాలిద్ మాట్లాడుతూ, తన పత్రిక ఉత్తమ పాత్రికేయ విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తోందని అందుకుగాను అనువైన వాతావరణాన్ని అందిస్తానానని చెప్పారు. లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజా ఉద్యమాలను, పోరాటాలను, ఆరాటాలను ముందుకుతీసుకెళ్లే విధంగా ఒక వేదికలా నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలుగు నేలంతా విస్తరించేలా, జనంసాక్షి కృషి చేస్తుందన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ, ప్రజాపక్షం వహిస్తూ నిజాలు నిర్భయంగా చెప్తామని అన్నారు. ముస్లింలు ప్రజాపోరాటంలో తెలంగాణ ఆత్మాభిమానం కోసం జరిగే పోరాటంలో దూరంగా ఉన్నారనే ఆపోహను తొలగించేందుకే తెలుగులోనే ఒక పత్రికను స్థాపించామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు రాజేశ్వరి, శ్రీనివాస్, వేణును బంగారు పతకాలతో, పేపర్‌బాయ్ మహబూబ్‌ను రూ.5 వేల నగదు అందించి అభినందించారు. జర్నలిజాన్ని సామాజిక బాధ్యతగా చాటిన జర్నలిస్టు అల్లూరి సీతారామరాజుకు ప్రత్యేక పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో, కె. సుధాకర్‌రావు, ఎం. కృష్ణారెడ్డి, ఇ. ప్రసాద్‌రావు, ముజాహిద్ హుస్సేన్, రమణమూర్తి, కేశవ్‌కుమార్, ప్రసాద్, శ్రీనివాస్, అశోక్, బోయినపల్లి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.