నేపాల్‌ భూకంపంలో 41 మంది భారతీయులు మృతి

6

ఖాట్మండ్‌,మే 4 (జనంసాక్షి):

నేపాల్‌లో వచ్చిన తీవ్ర భూకంపం కారణంగా అక్కడ 41మంది భారతీయులు చనిపోయారు. అక్కడ మొత్తం 57 మంది విదేశీయులు చనిపోగా వారిలో భారతీయులే 41మంది ఉండటం గమనార్హం. ఈ మేరకు నేపాల్‌ పోలీసులు  ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. అక్కడ ఇప్పటి వరకు మొత్తం 7,276 మంది చనిపోయారు. 14,267మంది క్షతగాత్రులయ్యారు. వారిలో పది మంది భారతీయులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత హెచ్చే అవకాశాలు ఉన్నాయని నేపాల్‌ ఆర్థిక మంత్రి రామ్‌శరన్‌ మకాత్‌ తెలిపారు. ఇదిలావుంటే  నేపాల్‌లో మందకొడిగా సాగుతున్న సహాయక చర్యలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అమెరికా విమానాలు రంగంలోకి దిగడంతో సహాయ జోరు పెరిగింది. నెపాల్‌లో పెనుభూకంపానికి అస్తవ్యస్థమైన మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. అమెరికా ఐదు విమానాలను రంగంలోకి దింపింది. వీటి రాకతో సహాయక చర్యల జోరు పెరిగింది. భారత్‌తో సహా పలు దేశాలు ఇప్పటికే సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. అయినా చాలా గ్రామాల్లో పూర్తి సహాయం అందడం లేదు. అవి పర్వత ప్రాంతాల్లోనూ… మారు మూల ఉండటమే కారణం. దానికి తోడు రుతుపవనాలు దగ్గరపడుతుండడంతో సహాయక చర్యలను వేగవంతం చేసే అవసరం ఏర్పడింది. దాంతో అమెరికా ఐదు విమానాలను రంగంలోకి దింపింది. మరి కొన్ని రోజుల్లో విమానాలు, హెలీకాఫ్టర్లు పంపేందుకు మరికొన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి.