యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
హైదరాబాద్ (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2024 తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు యూపీఎస్సీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా, జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 160 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) సహా 25కు పైగా సర్వీసుల్లోని వెయ్యికి పైగా పోస్టులు ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల అనంతరం మొత్తం 2,845 మంది అభ్యర్థులు తుది దశగా జరగనున్న ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో భాగంగా 2024 జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, జులై 1న ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలను డిసెంబర్‌లో ప్రకటించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి 2025 జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు రెండు సెషన్లలో ఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది.