కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు
ఒక్కో లావాదేవీకి రూ. 21 ఉన్న ఛార్జీలను రూ. 23కి పెంచాపు
ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచింది. సవరించిన ధరలు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకు నిర్దేశించిన ఉచిత నెలవారీ పరిమితి దాటిన తర్వాత చేసే వాటికి ఈ ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంకు జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఏటీఎంఎంలలో ఉచిత పరిమితి దాటిన ఆర్థిక పరమైన ఒక్కో లావాదేవీకి రూ. 21 ఉన్న ఛార్జీలను రూ. 23కి పెంచారు. అలాగే, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్‌మెంట్‌లు వంటి ఆర్థికేతర లావాదేవీలకు ఒక్కో లావాదేవీకి రూ. 8.5 నుంచి రూ. 10కి పెంపు నిర్ణయం జరిగింది. వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త ఛార్జీలు కోటక్ మహీంద్రా బ్యాంకు సొంత ఏటీఎంలు లేదా ఇతర బ్యాంకుల్లో చేసే లావాదేవీలకూ వర్తిస్తాయి. బ్యాంకు వివరాల ఆధారంగా, ప్రస్తుతం బ్యాంకు నెలలో ఐదు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను ఉచితంగా అందిస్తోంది. ఈ పరిమితి దాటి తర్వాత ఒక్కో లావాదేవీపై ఛార్జీలను విధిస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది.