పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
రోమన్(జనంసాక్షి): కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ప్రాన్సిస్ ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జి అయ్యారు. ఆయన మృతి విషయాన్ని వాటికన్ వర్గాలు ధ్రువీకరించాయి. 2013లో 16వ పోప్ బెనిడెక్ట్ తర్వాత ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే. ఆయన్ను ప్రజల పోప్ అంటారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు.