గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు
తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ తేదీ ఖరారైంది. ఈ వేడుకను జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన అవార్డుల కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు 14 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చలనచిత్ర పురస్కారాలను అందిస్తోందని దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ గుర్తుచేశారు. ఈ అవార్డులకు సినీ పరిశ్రమ నుంచి అపూర్వ స్పందన లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అవార్డులకు రాని రీతిలో స్పందన వచ్చిందని, అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 1,248 నామినేషన్లు అందినట్లు తెలిపారు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా అవార్డుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.