నోటుకు వద్దు ఓటు….నోటాకే నా ఓటు
క్యాబ్ డ్రైవర్ల వినూత్న ప్రచారం
ప్రజలకు మేలు చేయని పార్టీలకు ఓటేందుకు?
డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్
హైదరాబాద్,డిసెంబర్1(జనంసాక్షి): నోటాకే నా ఓటు… నోటాకే నా ఓటు… నోటాకే నా ఓటు.. ఇదేంటి? ఈ కొత్త ప్రచారం ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా..? హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన వినూత్న ప్రచారం ఇది. తమ సమస్యలు పట్టించుకోని పార్టీలకు ఓటెయ్యొద్దని.. ఇలా నోటా పాట పాడుతూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం గొంతెత్తి నినదించడమే కాదు.. వేలాది కార్లపై ‘నోటాకే నా ఓటు’ అనే నినాదంతో కూడిన పోస్టర్లను అతికిస్తున్నారు. ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో తమ సమస్యలను ప్రస్తావించలేదని.. ఉబర్, వోలా యాజమాన్యాల మోసాల బారి నుంచి కాపాడాలని విన్నవించుకున్నా
పట్టించుకోలేదని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ వినూత్న ప్రచారం చేపట్టామని ఆయన తెలిపారు. ప్రజలకు మేలు చేయని పార్టీలకు ఓటేసి ఏం లాభమంటున్నారు సలావుద్దీన్.ప్రజల అవసరాలు తీర్చే మేము, మా సమస్యలను ఏ పార్టీలు పట్టించుకోకపోవడంతో క్యాబ్ డ్రైవర్ల ఆవేదన.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఉన్నత ఉద్యోగులు అధికంగా ఉండే నగరంలో క్యాబ్ వినియోగించే వారి సంఖ్య కూడా ఎక్కువే. దీంతో క్యాబ్ డ్రైవర్ల ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. క్యాబ్ డ్రైవర్ల వాదనలో తప్పులేదంటూ.. వారికి మద్దతుగా నిలవడం విశేషం.