నోట్ల రద్దుపై మాట మార్చిన‌ నితీష్


పాట్నా(జ‌నం సాక్షి) :
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ రెండేళ్ల క్రితం తీసుకున్న పెద్ద నిర్ణయాన్ని మొదట్నించీ సమర్ధిస్తూ వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా ‘యూ టర్న్’ తీసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం ‘సాహసోపేతమైన నిర్ణయం’ తీసుకుందంటూ అప్పట్లో ప్రకటించిన నితీష్ తాజాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఒనగూరిన ప్రయోజనాలపై నిలదీశారు. ధనవంతులు, శక్తువంతులకు సహకరించేందుకు బ్యాంకులు ప్రయత్నించాయంటూ ఆరోపించారు. ‘పెద్ద నోట్ల రద్దుకు మద్దతిచ్చిన వారిలో నేనూ ఉన్నాను. అయితే దాని వల్ల ఎంతమంది ప్రజలు ప్రయోజనం పొందారు? కొంతమంది శక్తువంతులైన వారు తమ డబ్బును ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదలాయించుకున్నారు’ అని శనివారంనాడిక్కడ జరిగిన బ్యాంకర్ల సమావేశంలో నితీష్ వ్యాఖ్యానించారు.వ్యక్తుల నుంచి బాకీలు వసూలకు చాలా నిక్కచ్చిగా వ్యవహరించే బ్యాంకులు…రుణాలు తీసుకుని పరారైన శక్తువంతులైన వ్యక్తుల విషయంలో చేసిందేమిటని ప్రశ్నించారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు కూడా ఈ విషయం తెలియకపోవడం వింతగా ఉందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇది తన విమర్శగా కాకుండా ఆందోళనగా పరిగణించాలన్నారు. బీహార్‌వో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ పెద్ద నోట్ల రద్దు చర్యను తప్పుపట్టడం ఇదే మొదటిసారి కాగా, కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నాల్గవ వార్షికోత్సవం రోజే నితీష్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.
 సుశీల్ మోదీ దిద్దుబాటు చర్య…
కాగా, పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజానీకానికి ఒరిగిందేమిటని నితీష్ ప్రశ్నించిన వేదికపైనే ఉన్న బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ముఖ్యమంత్రి ప్రకటనను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. పెద్ద నోట్ల రద్దుకు నితీష్ పెద్ద మద్దతుదారని అన్నారు. కాగా, నితీష్ తన ప్రసంగంలోనే పెద్ద నోట్ల రద్దును సైద్ధాంతికంగా తాను సపోర్ట్ చేసినప్పటికీ, అదే బలంతో తాను పెద్ద నోట్ల రద్దు అమలు జరిగిన తీరు పేలవంగా ఉందని చెప్పడానికి వెనుకాడటం లేదన్నారు. సామాన్య ప్రజలు కడగండ్లపాలయ్యారని అన్నారు. ‘నేను అటు ప్లస్ (ప్రయోజనాలు)తో పాటు మైనస్ (లోటుపాట్లు)ను కూడా చూస్తున్నాను. అయితే మిగతా చాలామంది కేవలం మైనస్‌లు మాత్రమే చూస్తున్నారు’ అని నితీష్ పేర్కొన్నారు.