నో నెవర్.. ఎన్‌డీఏలో చేరం..మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్,ఫిబ్రవరి17(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్డీఏలో చేరుతుందని వస్తున్న వార్తలు అవాస్తవమని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశారు. తమ పార్టీకి ఎన్డీఏలో చేరే ఆలోచన లేనే లేదని తేల్చిచెప్పారు. మోడీ ప్రభుత్వంలో ఉండాలని ఆలోచించలేదని పేర్కొన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా రాష్టాల్రకు సహకరించాలని ఆయన తెలిపారు. కెసిఆర్ జన్మదినం సందర్భంగా ప్రధాని అభినందించినా, సమస్యలపై కెసిఆర్ ప్రధాని మోడీతో కలసినా ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయని అన్నారు. అయితే తమకు ఎన్‌డిఎలో చేరే ఆలోచన లేదన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కవిత పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేశారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్‌పై డైరెక్టర్ ఎన్. శంకర్ రూపొందించిన గీతాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ కవిత ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాంపల్లిలోని యూసుఫ్ బాబా దర్గాలో చద్దర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. పద్నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్ రాష్టాన్న్రి సాధించి ముఖ్యమంత్రి అయ్యారని మహమూద్ అలీ అన్నారు. అభివృద్థి పథంలో తీసుకెళుతున్న కేసీఆర్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వమే కొనియాడిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్టాన్న్రి సాధించడం కోసం సీఎం కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని ఎంపీ కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలసి భారీ కేక్‌ను ఆమె కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆనాడు గాంధీ స్వాతంత్య్రం సాధిస్తే.. ఈనాడు కేసీఆర్ తెలంగాణను సాధించారని కొనియాడారు. బందూక్ సినిమాలోని కేసీఆర్‌పై రాసిన పాటను కవిత విడుదల చేశారు. బందూక్ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. కెసిఆర్ కు పుట్టిన రోజు చేసుకునే అలవాటు లేదని ఆయన కుమార్తె, ఎమ్.పి కవిత అన్నారు.తన తండ్రి పుట్టిన రోజున తానే చాక్ లెట్ లు పంపిణీ చేసేదానినని ఆమె చెప్పారు. కెసిఆర్ పుట్టిన రోజు అయినా, తన పనితాను చేసుకుపోతుంటారని అన్నారు. అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, ఇంటిలోని వారికి కెసిఆర్ పుట్టిన రోజు ప్రత్యేకత కాని, ఆయనకు కాదని ఆమె అన్నారు. కెసిఆర్ స్టార్ బ్యాట్స్ మన్ అని, చిన్న బౌలర్లను చూసి భయపడరని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ప్రదాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కెసిఆర్ అరవై ఒకటో సంవత్సరంలో ప్రవేశించారు.అయితే కెసిఆర్ హైదరాబాద్ లో లేరు. ఆయన ముంబై లో అక్కడి తెలుగు గవర్నర్ విద్యాసాగరరావు వద్ద ఆతిధ్యంలో ఉండడం విశేషం.కాగా హైదరాబాద్ లో మాత్రం విస్తారంగా కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కటౌట్లు,ఫ్లెక్సీలు వెలిశాయి. రక్తదాన శిబిరం కూడా ఏర్పాటైంది. డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కేసీఆర్ కు
శుభాకాంక్షలు తెలిపారు.