పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గద్వాల, జనంసాక్షి: రాజులుపోయారు… రాజ్యాలు మాయమయ్యాయి. కాని వారి పాలనా కాలం నాటి పురాతన నాణేలు, పంచలోహ విగ్రహాలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన శనివారం గద్వాల మండలం పూడూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల శ్రీను మూడేళ్ల కిందట పూగూరులో ఇల్లు కట్టుకునేందుకు తవ్వాడు. ఆ సమయంలో ఒక కలశంలో చిన్నపాటి 7 పంచలోహ విగ్రహాల పెట్టె, దానిపై తాంబూలం శ్రీనుకు దొరికాయి. వాటిని అప్పటి నుంచి ఇంట్లో దాచుకొని పూజలు చేస్తున్నారు. డబ్బు అవసరం కావడంతో వాటిని విక్రయించేందుకు గద్వాల పట్టణంలోని తనకు తెలిసిన చేతివృత్తుల నగేష్ దగ్గరకు ఇటీవల తీసుకువచ్చాడు.
అవి పురాతన కాలం నాటివి కావడం, ఎక్కడైనా దొంగిలించాడనే అనుమానంతో పట్టణ పోలీసులకు నగేష్ సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మూడు విగ్రహాలతోపాటు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తన ఇంట్లో మరికొన్ని ఉన్నాయని చెప్పాడు. గ్రామంలోని ఓ నాయకుడి సహకారంతో మిగతా విగ్రహాలను ఈ నెల 11న పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే పోలీసులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. శనివారం ఈ విషయం బయటకు పొక్కడంతో తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, గిర్ధావర్ నర్సింగరావు, వీఆర్‌ఓతో కలిసి గ్రామానికి వెళ్లి వడ్ల శ్రీనును విచారించి విగ్రహాలు దొరికిన ప్రాంతాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు.
అనంతరం ఈ విషయాన్ని తహసీల్దార్ పోలీసులను ప్రశ్నించగా..అప్పటికప్పుడే డీఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేషం నిర్వహించి వారు స్వాధీనం చేసుకున్న విగ్రహాలు, వాటిని అమ్మడానికి ప్రయత్నించిన వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరెడ్డి మాట్లాడుతూ…. సమాచారలోపల వల్ల ముందుగాదనే వివరాలు వెల్లడించలేకపోయామన్నారు. ఆలస్యానికిగల కారణానాలను తెలుసుకొని బాధ్యలపై చర్యలు తీసుకుంటామన్నారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. విగ్రహాల అమ్మడానికి ప్రయత్నించిన వ్యక్తిని తమ సిబ్బంది కొట్టడానికి గల కారణాలను విశ్లేషిస్తామన్నారు.