పంచాయితీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

 

మూడుదశల్లో ఎన్నికల నిర్వహణ

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ద్వార తండాలను, గూడాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. న్నికల షెడ్యూల్‌ ఎప్పుడు విడుదలైతే ఆ సమయానికి ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణ పక్రియను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ముస్త్యాల రాంకిషన్‌ పర్యవేక్షిస్తున్నారు.కొత్త పంచాయతీలతో ఎన్నికల పక్రియను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో మూడు దశల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇందుకోసం సుమారు ఐదు వేల మంది పోలింగ్‌ సిబ్బందిని వినియోగిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు సింగరేణి నుంచి కూడా ఎన్నికలనిర్వహణకు సంబంధించిన సిబ్బందిని వినియోగించనున్నామన్నారు. అన్ని జాబితాలు తమకు చేరాయన్నారు. బ్యాలెట్‌ బాక్సుల కొరత ఉన్నందున కర్ణాటక రాష్ట్రం నుంచి బ్యాలెట్‌ బాక్సులను తెప్పించామన్నారు. మొత్తం 4,232 పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేశామని, వాటన్నింటినీ పరిశీలించి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యేలా కార్యాచరణను పూర్తి చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు టెండర్లు ఆహ్వానించామని అన్నారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు సంబంధించిన పేపర్‌ను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, కేవలం ముద్రణ మాత్రమే టెండర్ల ద్వారా చేయిస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై నామినేషన్ల పక్రియ పూర్తయి ఉప సంహరణలు జరిగిన తరువాత పోటీలో ఉండే అభ్యర్థుల ఆధారంగా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ చేపడతారు.