పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం
మండలాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
కామారెడ్డి,జనవరి18(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 35 మంది సర్పంచులు, 448 వార్డుమెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొమ్మిది మంది జిల్లా అధికారులను మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల అభివృద్ధి అధికారులు, రిటర్నింగ్ అధికారులతో పంచాయతీ ఎన్నికలపై సవిూక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని, పంపిణీ సమయంలో రసీదుతో పాటు ఓటరు సెల్‌ఫోన్ నంబరు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్‌ఫోన్ నంబర్ల ద్వారా స్పెషల్ ఆఫీసర్లు ర్యాండమైజేషన్ పరిశీలనతో ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షిస్తారని చెప్పారు. పోలింగ్, కౌంటింగ్ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. కౌంటింగ్ హాలులోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక అనంతరం డిక్లరేషన్ రిజల్ట్స్ ప్రకటించడం, పోలింగ్‌స్టేషన్‌లో కౌంటింగ్ సమయంలో ప్రజలు గుమిగూడకుండా చూడడం, పోలింగ్ ఏజెంట్ల వివరాలు ముందుగా తీసుకోవడం తదితర అంశాలను స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా ఆఫీసర్‌ను నియమించుకోవాలని, వర్కింగ్ షీట్స్ తయారు చేసుకోవాలన్నారు. సంబంధిత నివేదికలు వెంటనే సమర్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. పోలింగ్‌రోజున నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.