పంచాయితీ ఎన్నికల్లో పెరిగిన కిక్కు
ఒక్క నెలలోనే కోటికి పైగా ఆదాయం
భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభావంతో మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో మద్యం విక్రయాలు పెరిగి ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. మొదటి,రెండో విడతల్లో జిల్లాలోని ఆయా మండల, గ్రామాల్లో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గత ఏడాది జనవరి నెలతో పోలిస్తే ఈ ఏడాది రూ.కోటికి పైగా ఇప్పటికే ఆదాయం వచ్చింది.రెండు, మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సైతం ఇదే నెలలో జరగనుండటంతో మరికొంత ఆదాయం ఎక్సైజ్ రానుంది. జనవరి1 నుంచి 21వ తేదీ వరకు మద్యం విక్రయాలు పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. మరోవైపు చలికాలం అయినప్పటికి బీర్ల విక్రయ జోరు ఏమాత్రం తగ్గలేదు. బీర్లు కూడా విరివిగానే అమ్మకమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే లిక్కర్ బాటిళ్లు, బీర్ల ద్వారా రూ.కోటికి పైగానే జనవరిలో 20 రోజులకు గాను ఆదాయం రావడం గమనార్హం. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, ఖమ్మం జిల్లాలో సైతం మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.32కోట్ల 71లక్షల ఆదాయం వచ్చింది. పంచాయతీ ఎన్నికల తొలి విడత అశ్వాపురం, బూర్గంపహాడ్, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పాల్వంచ, ములకలపల్లిలో జరిగాయి. రెండవ విడతలో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, కరకగూడెం, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి మండలాల్లో జరగనున్నాయి. మూడవ విడత ఎన్నికలు లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి, ఇ/-లలెందు, ఆళ్లపల్లి, గుండాల తదితర ప్రాంతాల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో మద్యం విక్రయాల జోరు మళ్లీ ఊపందుకోనుంది. ఆయా పంచాయతీల్లో ఎన్నికల్లో గెలుపొందేందుకు కొందరు అభ్యర్థులు తొలి విడతలోనే పెద్ద ఎత్తున మద్యం పంపిణీ చేశారు. లైసెన్స్ మద్యం దుకాణాల ద్వారానే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న బెల్టు షాప్ ద్వారా కూడా పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. ఈనెలాఖరు వరకు రెండు, మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక మద్యం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఓట్ల కోసం మద్యంతో అబ్యర్థులను మచ్చిక చేసుకుంటున్నారు.