పంచాయితీ ఎన్నికల రోజుల సెలవు
కామారెడ్డి,జనవరి19(జనంసాక్షి):
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ప్రభుత్వం సెలవుదినం ప్రకటించినట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మొదటి విడతగా ఈ నెల 21న కామారెడ్డి డివిజన్‌లోని కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, భిక్కనూరు, మాచారెడ్డి, బీబీపేట్, దోమకొండ, రాజంపేట్, తాడ్వాయి మండలాల్లోని వివిధ గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 21న పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా సెలవుఉల ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న రెండో విడత ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్‌లోని ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, గాంధారి, బాన్సువాడ డివిజన్ పరిధిలోని నిజాంసాగర్, పిట్లం మండలాలు, ఈ నెల 30న మూడో విడత సందర్భంగా బాన్సువాడ డివిజన్‌లోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్‌గల్ మండలాల్లోని గ్రామ పంచాయతీలకు పోలింగ్, కౌంటింగ్ జరుగుతున్నందున సెలవు దినంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు వీలుగా కార్యాలయ విధులకు ఆలస్యంగా గానీ, లేదా కార్యాలయ విధుల నుంచి ముందుగా గానీ వెళ్లేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పోలింగ్‌కు ముందురోజులైన ఈ నెల 20, 24, 29వ తేదీల్లో పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి వినియోగించనున్న పబ్లిక్ భవనాలు, విద్యాసంస్థల భవనాలు, ఇతర భవనాలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు వివరించారు.