పంజాగుట్ట రహదారిపై గుంత..స్తంభించిన ట్రాఫిక్‌

సాయంత్రానికల్లా పరిష్కఝిస్తాం : కృష్ణబాబు
హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): పంజాగుట్ట-అమీర్‌పేట మధ్య ట్రాఫిక్‌ జామైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో పంజాగుట్ట నుంచి అమీర్‌పేట వెళ్లే మార్గంలో రోడ్డు మధ్య భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అమీర్‌పేట నుంచి ఖైరతాబాద్‌ వైపు వెళ్లే వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వాటి రాకపోకలను రాజ్‌భవన్‌వైపు మళ్లించారు.

నీరు, డ్రైనేజీ పైపుల లీక్‌ వల్లే.. : కృష్ణబాబు

నీరు, డ్రైనేజీ పైపుల నుంచి నీరు లీకవుతుండడంతోను.. నేల బాగా తడిసి ఉండడంతోను.. పంజాగుట్ట ప్రధాన రహదారిలో శుక్రవారం ఉదయం గుంత ఏర్పడిందని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ కృష్ణబాబు అన్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, సిబ్బంది, వాహనదారులకు ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. శుక్రవారం సాయంత్రానికల్లా పరిస్థితిని చక్కదిద్దుతామని తెలిపారు. ఇప్పటికే ఇరిగేషన్‌, డ్రైనేజీ విభాగాలకు సంబంధించిన అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించామని వారందరూ రాగానే పరిస్థితిని సమీక్షించి చక్కదిద్దుతామని తెలిపారు. పలు విభాగాల మధ్య నెలకొన్న సమన్వయ లోపం వల్లే ఇలాంటి సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. సంబంధిత విభాగాల అధికారులు పైపులైన్లను నిరంతరం పరీక్షించకపోవడం కూడా సమస్యకు మరో కారణమన్నారు. తాను ఆయా విభాగాలకు లేఖలు రాస్తునే ఉన్నామని చెప్పారు. నాలా కాంట్రాక్టరుపై కూడా చర్యలు తీసుకుం టామని చెప్పారు. మరో కాంట్రాక్టరుకు పనులు అప్పగించి మున్ముందు ఇలాంటివి జరక్కుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నీరు, డ్రైనేజీ పైపుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకుంటామని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. ఖైరతాబాద్‌-అమీర్‌పేట మధ్య నడిచే వాహనాల రాకపోకలను ఇతర మార్గాలవైపు మళ్లించారని, ప్రజలు సహకరించాలని కోరారు.