పంజాబ్‌లో ఆర్మీయునిఫాం అమ్మకం నిషేధం

1

ఛండీగఢ్‌,ఫిబ్రవరి 28(జనంసాక్షి): రాష్ట్రంలో సైనిక దుస్తుల అమ్మకాలపై నిషేధం విధించినట్లు పంజాబ్‌ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సరైన గుర్తింపు లేకుండా ఈ రకమైన దుస్తులు అమ్మరాదని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని గురుదాస్‌పుర్‌, పఠాన్‌కోట్‌లో సైనిక దుస్తులు ధరించి మారువేషాల్లో ఉగ్రవాదులు దాడులు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరైనా సైనిక దుస్తులు కొనుగోలు చేయాలంటే వారు స్వీయ ధ్రువీకరణ గుర్తింపు పత్రం, మొబైల్‌ సంఖ్యను అమ్మకందారులకు సమర్పించాలి. షాప్‌ యజమాని క్రమం తప్పకుండా ఏ రోజున ఎవరికి సైనిక దుస్తులు అమ్మారో తెలిపే రిజిస్టర్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ 21 వరకు నిషేధం అమలులో ఉంటుందని తర్వాత ఏమి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. పోలీసు వాహనాలపై వాడే ఎరుపు, నీలం రంగు స్టిక్కర్లు, వాహనాల ఫలకాలపై రాజకీయ పార్టీల పేర్లు రాయడంపై వెంటనే నిషేధం అమల్లోకి వస్తుందన్నారు.