పంటల వివరాల సేకరణలో అధికారులు
కొనుగోళ్ల సమయాల్లో దళారులను నిరోధించే చర్యలు
ఆదిలాబాద్,జూలై7(జనం సాక్షి): జిల్లాలో రైతుల వారీగా సాగుచేసిన పంటల వివరాలు సేకరించేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పంటల కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతాయి. రైతులు పంటలు విక్రయానికి తీసుకువచ్చినప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి తీసుకురావాల్సి ఉంటుంది. ఏఈవోలు సీజన్‌కు ముందుగానే రైతులు వారీగా పంటల వివరాలు సేకరించడంతో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందనే సమాచారం ఉంటుంది. పంట దిగుబడిని అంచనా వేసి దీని ఆధారంగా రైతులకు వారు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. పంటల కొనుగోళ్లలో ఏఈవోలు ధ్రువీకరణ పత్రాలను అసలైన రైతులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉండడంతో దళారులు వివిధ పంటలను మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చే అవకాశం ఉండదు. పంటల వివరాలను ముందుగానే సేకరిస్తుండడంతో దళారుల దందాకు చెక్ పడటమే కాకుండా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభిస్తుంది.జిల్లాలో 92 వ్య వసాయ విస్తరణ అధికారుల క్లస్టర్‌లు ఉన్నాయి. ఈ క్లస్టర్‌ల వారీగా రైతుల వివరాలు సేకరిస్తారు. మండలం, గ్రామం, ఏఈవో క్లస్టర్, రైతు పేరు, మొత్తం విస్తీర్ణం, ఏ పంటను ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలను ఏఈవోలో వారి ట్యాబ్‌లో నమోదు చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. జిల్లాలో రైతులు ఎక్కువగా వానాకాలం పంటలను సాగు చేస్తారు. ఈ సీజన్‌లో పత్తి, సోయాబిన్, కంది, మినుమ, పెసర పంటలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మార్కెట్‌యార్డుల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటల కొనుగోళ్లు జరుగుతాయి. రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రైతుల సాగుచేసిన పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతుల నష్టపోకుండా వివిధ పంటలను సేకరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. జిల్లాలో ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, జైనథ్ మార్కెట్‌యార్డులు ఉన్నాయి. వీటితో బేల, హస్నాపూర్‌లో సబ్‌మార్కెట్‌లలో కొనుగోళ్లు నిర్వహిస్తారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మార్కెఫెడ్, ఆయిల్ ఫెడ్ లాంటి సంస్థలు జిల్లాలో పత్తి, కంది, సోయాబీన్ పంటలను కొనుగోలు చేస్తాయి. జిల్లాలో యాసంగిలో సాగుచేసిన శనగ పంటను సైతం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తారు. జిల్లాలోని నాలుగేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారాపంటలను కొనుగోలు చేయడంతో రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది. జిల్లాలోని భూ సమగ్ర సర్వేలో భాగంగా రెవెన్యూ అధికారులు 508 గ్రామాల్లోని భూముల వివరాలను సేకరించారు. ఈ సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. రైతులు పత్తి, సోయాబీన్, కంది పంటలను ఎక్కువగా సాగుచేస్తారు. ఏటా అక్టోబర్‌లో సోయాబీన్, పత్తి పంటల కొనుగోళ్లు జనవరిలో కందుల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. యాసంగిలో సాగుచేసిన శనగలను సైతం కొనుగోలు చేస్తారు. కొందరు దళారులు రైతులు సాగుచేసిన పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.