పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మహబూబ్‌నగర్,జనవరి28(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కోరారు. పప్పుశనగ, మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులు వర్షానికి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పంటలబీమాపై సరైన అవగాహన లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. బ్యాంకులు రైతుల నుంచి తీసుకున్న రుణాలపై బీమా ప్రీమియం చెల్లించటంలేదని ఆరోపించారు. అన్నదాతలకు పంటల బీమాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అన్నదాతలకు పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంటనష్టం వివరాలను సేకరించి అధికారులకు వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు. మరోవైపు నర్వ సహకార సంఘం కార్యాలయంలో కందులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల రైతులు కోరారు. పక్షం రోజులుగా ధాన్యం బస్తాలను కేంద్రంలోనే ఉంచినా కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యం బస్తాలను తక్షణమే కొనుగోలు చేయాలని అన్నారు. కొద్దిరోజుల కిందట రైతులకు ముందస్తుగా టోకెన్లు ఇచ్చి ప్రస్తుతం కొనుగోలును మూసివేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికీ మండల వ్యాప్తంగా సగం మంది రైతులే కొనుగోలు చేసుకున్నారని, చాలా గ్రామాల్లో రైతుల బస్తాలను అమ్ముకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.