*పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు*

మునగాల, అక్టోబర్ 11(జనంసాక్షి): మునగాల మండలంలో తిమ్మారెడ్డిగూడెం గ్రామంనందు వ్యవసాయ అధికారుల బృందం మంగళవారం వరి పంట పొలాలను క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. గ్రామంలోని వరి పొలలను పరిశీలిస్తూ పంటపై బ్యాక్టీరియా ఎండ తెగులు ఉదృతి ఉన్నట్లు గమనించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి బి అనిల్ కుమార్ తెలిపారు. ఇది జాంతోమోనాస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. పంటకు ఈ తెగులు నారుమడిలో, పిలకలు తొడిగే దశలో ఆశించినప్పటకి, మనకు వెన్ను దశలో బాగా కనిపిస్తుందని తగు నివారణ చర్యలు సూచించడం జరిగింది. అయితే ఈ తెగులు ఆశించినపుడు నత్రజని ఎరువు (యూరియా) వేయకూడదని, పొటాష్ ఎరువు ఎకరానికి 25 కిలోలు వేయాలని, నీరు మొత్తం తీసివేసి మళ్లీ కొత్త నీరు పెట్టాలని, ఎకరానికి అగ్రీమైసిన్ 80 గ్రాములు, ప్లాంటోమైసిన్ 40 గ్రాములు, ఫ్యాజోమైసిన్ 40 గ్రాములు మూడింటిలో ఒకటి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు. ఈ తెగులు ఆశించినపుడు పైరుకి ఏ ఇతర మందులు పిచికారి చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు రంగయ్య, విస్తరణ అధికారి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.