పంట రుణమాఫీ కుంభకోణం

వెల్లడించిన కాగ్‌
యూపీఏకు మరో చికాకు
న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి):
యూపీఏ సర్కారుకు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటికే వివిధ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి తాజాగా మరో స్కాం మెడకు చుట్టుకుంటోంది. పంట రుణాల మాఫీలో అనేక అవకతవకలు జరిగాయని కంప్టోల్రర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వెల్లడించింది. రూ.52 వేల పంట రుణాల మాఫీ అమలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. అర్హులకు కూడా అనర్హులకు రుణ మాఫీ చేశారని ఎత్తిచూపింది. కోట్లల్లో జరిగిన కుంభకోణం బయటపడకుండా ఉండేందుకు రికార్డులను తారుమారు చేశారని, ఆర్థిక శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నిర్వీర్యం చేశారని పేర్కొంది. పంట రుణాలపై కాగ్‌ మంగళవారం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పలు కీలక అంశాలను వెల్లడించింది. పంట రుణాల మాఫీలో అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని తెలిపింది. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మాఫీ వర్తించలేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రుణ మాఫీ వివరాలను కాగ్‌ పరిశీలించి అకవతవకలు జరిగినట్లు నిర్ధారించింది. దేశంలో 90,576 రుణమాఫీలను పరిశీలించగా, 20,216 రుణమాఫీల్లో అక్రమాలు తేలయాని కాగ్‌పేర్కొంది. మరో 9,334 రుణమాఫీ కేసులను పరిశీలింగా.. అందులో.. 1257 ఖాతాలు మాత్రమే అర్హమైనవని తేలిందని తెలిపింది. ‘పంట రుణాల మాఫీలో.. 22.32 శాతం కేసులను పరిశీలించగా.. అనేక అక్రమాలు, తప్పులు బయటపడ్డాయి. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం’ అని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. రుణమాఫీ అసలైన లబ్ధిదారులకు వర్తించలేదని కుండ బద్దలు కొట్టింది.
వ్యవసాయ పంట రుణాల మాఫీ పథకం (ఏడీడబ్ల్యూడీఆర్‌ఎస్‌) కింద 2008లో 3.69 కోట్ల చిన్న సన్నకారు రైతులు, 60 లక్షలకు పైగా ఇతర రైతులు లబ్ధిపొందారు. వారు తీసుకున్న దాదాపు రూ.52,516 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే, వ్యవసాయేతర రుణాలు తీసుకొన్న వారికి, నిబంధనలు వర్తించని వారికి రుణాలు మాఫీ చేశారని కాగ్‌ తనిఖీలో వెల్లడైంది. అసలైన అర్హులకు మాత్రం లబ్ధి చేకూరుందని పేర్కొంది. లబ్ధిదారులను అసలు పరిగణనలోకే తీసుకోలేదని తెలిపింది. కానీ, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు అక్రమంగా లబ్ధి చేకూర్చారని వెల్లడించింది.
రాష్ట్రంలోనూ వెలుగుచూసిన అక్రమాలు..
ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా అక్రమాలు జరిగాయని కాగ్‌ వెల్లడించింది. 153 రుణ మాఫీలను పరిశీలించగా.. బ్యాంకులు అదనంగా రూ.31 లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారించింది. 193 కేసులను పరిశీలించగా.. అర్హులకు రూ.1.16 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు కాగ్‌ తెలిపింది. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని 32 బ్యాంకు శాఖల్లో 3,200 ఖాతాలను కాగ్‌ పరిశీలించింది. ఆధారాలు మాయం చేయడంపై కాగ్‌ మండిపడింది. డీఎఫ్‌ఎస్‌ను పరిపుష్టం చేయడంతో పాటు అవకతవకలకు పాల్పడుతున్న అధికారులు, బ్యాంకులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించింది.